'సలార్‌' బాట‌లోనే.. ఎన్టీఆర్ 'డ్రాగ‌న్‌'!

ABN , Publish Date - Mar 11 , 2026 | 08:10 AM

టాలీవుడ్‌లో అత్యంత భారీ అంచనాలున్న చిత్రాల్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ఒకటి.

NTR Neel

టాలీవుడ్‌లో అత్యంత భారీ అంచనాలున్న చిత్రాల్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్ ఒకటి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవలే జోర్దాన్ షెడ్యూల్‌ను యుద్ధ వాతావరణం కారణంగా నిర్ణీత సమయం కంటే ముందే పూర్తి చేసుకున్న చిత్ర బృందం, ఇప్పుడు హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్స్‌లో మిగిలిన భాగాన్ని చిత్రీకరిస్తోంది. అయితే, ముందుగా అనుకున్నట్లుగా జూన్ లేదా జూలైలో సినిమా విడుదల కావడం కష్టమేనని, త్వరలోనే వాయిదాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని చిత్ర వర్గాల సమాచారం.

ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్, నీల్ ఒక తెలివైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. వ్యయాన్ని తగ్గించడంతో పాటు తారక్ కాల్‌షీట్స్ వృథా కాకుండా ఉండేందుకు, సీక్వెల్‌కు సంబంధించిన కొన్ని కీలక భాగాలను ఇప్పుడే చిత్రీకరిస్తున్నారట. గతంలో వచ్చిన బాహుబలి, పుష్ప, కేజీఎఫ్ వంటి చిత్రాలు రెండు భాగాల మధ్య దాదాపు రెండు నుంచి మూడు ఏళ్ల సుదీర్ఘ విరామం తీసుకున్నాయి. కానీ, ఈ సినిమా విషయంలో మాత్రం 'ధురంధర్' తరహాలో మొదటి భాగానికి, సీక్వెల్‌కు మధ్య ఎక్కువ గ్యాప్ లేకుండా ఉండేలా పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నారు.

దర్శకుడు ఆదిత్య ధర్ తన 'ధురంధర్' సినిమా విషయంలో ఎలాంటి పక్కా ప్రణాళికను అనుసరించారో, ప్రశాంత్ నీల్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు. వాయిదా పుకార్లను పక్కన పెట్టి, చెప్పిన సమయానికే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో ఆదిత్య ధర్ చూపిన చొరవ అద్భుతమైనది. అదే రీతిలో ప్రశాంత్ నీల్ తన గత చిత్రం 'సలార్' కోసం పాటించిన స్ట్రాటజీనే ఇక్కడ కూడా అమలు చేస్తున్నారు. పార్ట్ 1 తో పాటే పార్ట్ 2 కి సంబంధించిన కొంత షూటింగ్‌ను ముగించి, తక్కువ సమయంలోనే రెండు భాగాలను సిద్ధం చేయాలని ఆయన భావిస్తున్నారు.

ఈ సినిమాకు 'డ్రాగన్' అనే పేరు ప్రచారంలో ఉన్నప్పటికీ, దర్శకుడు ఇంకా దానిని అధికారికంగా ధృవీకరించలేదు. 'సలార్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటివరకు ఏ దర్శకుడు స్పృశించని ఒక సరికొత్త 'హిస్టారికల్ మాఫియా డ్రామా'ను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

ఇందులో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎన్టీఆర్ పాత్ర రెండు మూడు వైవిధ్యమైన షేడ్స్‌లో ఊహించని విధంగా ఉంటుందని టాక్. సీక్వెల్ షూటింగ్‌ను కూడా సమాంతరంగా ప్లాన్ చేయడం వల్ల అభిమానులకు రెండో భాగం కోసం ఎక్కువ కాలం వేచి చూడాల్సిన అవసరం ఉండదు. తారక్- నీల్‌ ఈ క్రేజీ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Updated Date - Mar 11 , 2026 | 10:33 AM