VC Sajjanar: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై సజ్జనార్ అసంతృప్తి.. తారక్‌కు బహిరంగ విజ్ఞప్తి
ABN , Publish Date - Oct 09 , 2026 | 12:56 PM
జూనియర్ ఎన్టీఆర్ (Jr Ntr) అభిమానుల తీరుపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ (Jr Ntr) అభిమానుల తీరుపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘చుట్టమల్లే’ పాటకు సంబంధించిన వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు పేర్కొంటూ సోషల్ మీడియాలో ఓ ఫొటో ప్రచారంలోకి వచ్చింది. అయితే, ఆ ఫొటో ఏఐతో సృష్టించిన నకిలీ చిత్రమని సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై స్పందిస్తూ నేరుగా ఎన్టీఆర్‌ను ట్యాగ్ చేసి ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ‘సౌత్ డిజిటల్ మీడియా’ పేరుతో ఉన్న ఓ ఎక్స్ హ్యాండిల్‌లో అరెస్టుకు సంబంధించిన సమాచారంతోపాటు ఓ ఫొటోను పోస్ట్ చేశారు. అందులో ఓ వ్యక్తికి ముఖానికి ముసుగు వేసి ఉండగా, పక్కన పోలీసు అధికారులు, ఎన్టీఆర్ అభిమానులు ఉన్నట్లుగా కనిపించింది. ఈ ఫొటో వైరల్‌గా మారింది. ఆ ఫోటో వాస్తవమైనది కాదని, పూర్తిగా ఏఐ సాయంతో సృష్టించిన ఫేక్ ఇమేజ్ అని సజ్జనార్ వెల్లడించారు.
'ఏఐ సాంకేతికతతో రూపొందించే నకిలీ చిత్రాలు అసలైన ఫొటోల మాదిరిగానే కనిపిస్తున్నాయి. ఇలాంటి చిత్రాలను చూసి ప్రజలు మోసపోవద్దు. వాటి నిజానిజాలను నిర్ధారించుకోకుండా ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి సమాచారాన్ని గుడ్డిగా నమ్మకుండా, వాస్తవాలను పరిశీలించిన తర్వాతే స్పందించాలి. ఫ్యాక్ట్ చెక్ చేయకుండా కంటెంట్‌ను షేర్ చేయడం వల్ల తప్పుడు సమాచారం వేగంగా వ్యాపిస్తోంది. నా ఫొటోను మార్ఫింగ్ చేసి ప్రచారం చేస్తున్న విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ గారు దయచేసి గమనించాలి. ఈ తరహాలో నా ఫొటోను దుర్వినియోగం చేస్తున్న మీ అభిమానుల తీరును మీ దృష్టికి తీసుకువస్తున్నాను. ఏఐతో మార్ఫింగ్ చేసిన చిత్రాలు, వీడియోల ద్వారా వ్యక్తుల ప్రతిష్ఠకు భంగం కలిగించడం ఆందోళనకరం. డీప్‌ఫేక్‌లను గుర్తించడం, తప్పుడు సమాచారాన్ని అడ్డుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ కనిపించగానే నిజమని నమ్మి ప్రచారం చేయకుండా, దాని విశ్వసనీయతను పరిశీలించాలని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాను'' అని ఎక్స్ లో పేర్కొన్నారు