Sumalatha: డాన్సర్స్ అసోసియేషన్‌లో ఇంటి దొంగలు!

ABN , Publish Date - Jul 13 , 2026 | 06:10 PM

ఆదివారం డాన్సర్స్ అసోసియేషన్‌లో జరిగిన గొడవపై జానీ మాస్టర్, ఆయన భార్య, అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. తనకు, శేఖర్ మాస్టర్ కు మధ్య గొడవ జరిగిందన్నది నిజం కాదని జానీ మాస్టర్ స్పష్టం చేశారు.

Johnny Master Pressmeet

ఆదివారం డాన్సర్స్ అసోసియేషన్ బై ఎలక్షన్స్ కు సంబంధించిన సీక్రెట్ ఓటింగ్‌ సమయంలో రచ్చ జరిగింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జానీ, శేఖర్ మాస్టర్ల మధ్య మాట యుద్థం జరిగిందని, ఇద్దరూ గొడవ పడ్డారని వార్తలు వచ్చాయి. అయితే సోమవారం ఈ విషయమై సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జానీ మాస్టర్ ఖండించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ, 'నిన్న జరిగిన సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్ కు శేఖర్ మాస్టర్, రమేశ్‌ మాస్టర్, మరికొందరు మాస్టర్స్ రావడం జరిగింది. ఈ సీక్రెట్ బ్యాలెట్ ఎన్నికల సమయంలో శేఖర్ మాస్టర్, నేను కొట్టుకున్నామని, అరుచుకున్నామని కొంత ప్రచారం జరిగింది. కొందరు వీడియోలు తీసి ఛానెల్స్ లో ప్రసారం చేశారు. అయితే అదంతా ఫేక్. శేఖర్ అన్న నాకు ఎప్పటికీ బ్రదరే. ఆయన చాలా మంచి వ్యక్తి. భాను మాస్టర్ కూడా ఎంతో మంచి వ్యక్తి. వారందరితో నాకు చక్కని అనుబంధం ఉంది. ఇప్పటికీ నాకే కష్టం వచ్చినా శేఖర్ మాస్టర్ వస్తారు. ఆయనకు ఏ అవసరం ఉన్నా నేను వెంటనే స్పందిస్తాను. అయితే నిన్న ప్రసారం జరిగిన వీడియోలను చూసి చిరంజీవిగారు నన్ను ఈ రోజు షూటింగ్‌ స్పాట్‌ కు పిలిపించి మాట్లాడారు. శేఖర్ మాస్టర్ అన్న కూడా వచ్చారు. చిరంజీవి గారితో కలిసి మేమిద్దరం భోజనం చేశాం. సరదాగా సినిమా పాటల గురించి మాట్లాడుకున్నాం. మా గురించి ఆలోచించి, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న చిరంజీవిగారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన పాటలు చూసి, డాన్సులు చూసి స్ఫూర్తి పొంది ఇక్కడికి వచ్చిన వాళ్ళమే మేమంతా. ఆయనకు మేం ఎంతో రుణపడి ఉంటాం. మాది ఓ కుటుంబం లాంటిది. ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా వాటిని మేమే పరిష్కరించుకుంటాం' అని తెలిపారు.

WhatsApp Image 2026-07-13 at 6.14.39 PM.jpeg


అనంతరం డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత మాస్టర్ మాట్లాడుతూ, 'మా అసోసియేషన్ 35 సంవత్సరాల చరిత్ర కలిగింది. ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి చిన్న తప్పులు, పెద్ద తప్పులు జరుగుతున్నాయి. అయితే ఎవరు తప్పు చేసినా అది ప్రెసిడెంట్ మీదకే వస్తుంటుంది. అలా నన్ను ఎవరూ వేలెత్తి చూపకూడదని నేను భావించాను. అందువల్ల తప్పు జరిగిందని తెలిసినప్పుడు నేను గట్టిగా వారిని ప్రశ్నిస్తూ వచ్చాను. గతంలో జరిగిన కొన్ని ఆర్థిక అవకతవకలను ప్రశ్నించడం వల్లే ఈ గొడవలు మొదలయ్యాయి. ఇలా అడగడం కొందరికి నచ్చడం లేదు. నేను ఏ విషయంలోనూ ఒంటద్దు పోకడలు పోలేదు. బైలా ప్రకారం, లీగల్ ఒపీనియన్ తీసుకుని, మెజారిటీ సభ్యుల సమ్మతితోనే వ్యవహరించాను. గత కమిటీలో ఉన్న కొంతమంది ఇన్ ఛార్జీలు డాన్సర్స్ డబ్బులు దోచుకుంటున్నారు. నిర్మాతల నుండి భారీ మొత్తాలు తీసుకుని డాన్సర్స్ కు ఇవ్వకపోవడం తప్పు. అలా చేయడాన్ని మేం ప్రశ్నించి, జనరల్ బాడీలో నిర్ణయం తీసుకుని అలా చేసిన వారిని సస్పెండ్‌ చేస్తామని చెప్పాం. దాంతో వారు రాజీనామాలు చేశారు. వారికి మద్దతుగా మరికొందరు రాజీనామా చేసి, మొత్తంగా కొత్త కమిటీని ఎన్నుకోవాలని పథక రచన చేశారు. దానిని మేం వ్యతిరేకించాం. జన్యూన్ గా గెలిచిన మాకు ఈ పదవిలో ఇంకా యేడాన్నర ఉండే ఛాన్స్ ఉంది. వారు తప్పులు చేసి, మూకుమ్మడిగా రాజీనామా చేస్తే మేమేందుకు పదవి నుంచి తప్పుకోవాలన్నది మా వాదన. ఈ విషయం ఫెడరేషన్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. వాళ్ళు కూడా తప్పు చేసిన వారిని సమర్థిస్తూ, కొన్ని విషయాలు చూసి చూడనట్టు పోవాలని అంటున్నారు. మమ్మల్ని కూడా రాజీనామా చేయమంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఏ బైలాలోనూ ఇలాంటిది లేదు. అదే విషయాన్ని ప్రశ్నించినందుకు ఫెడరేషన్ ను మేం వ్యతిరేకిస్తున్నామనే ప్రచారం కొంతమంది చేస్తున్నారు. నిన్న కేవలం బై ఎలక్షన్స్ నిర్వహించాలా వద్దా అనే విషయం తెలుసుకోవడానికి జరిగిన సీక్రెట్ ఓటింగ్‌ మాత్రమే. అందులో ముగ్గురు సభ్యులు మినహా 70 మందికి పైగా సీక్రెట్ ఓటింగ్‌ ద్వారా బై ఎలక్షన్స్ జరపాలని ఓటు వేశారు. దానికి అనుగుణంగా తో ఈ నెల 26వ తేదీ మా కార్యవర్గంలో రాజీనామా చేసిన జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ తో పాటు ఎనిమిది మంది కార్యవర్గ సభ్యుల పోస్టులకు ఎన్నికలు జరుపబోతున్నాం' అని స్పష్టం చేశారు. మొత్తం మీద ఇదంతా టీ కప్పులో తుఫాన్ అని జానీ మాస్టర్ చెప్పినా... డాన్సర్ అసోసియేషన్ లో ఇంటి దొంగలు చాలా మందే ఉన్నారనే విషయాన్ని సుమలత తెలిపారు. ఇదే సందర్భంలో 'పెద్ది' సినిమాకు కొరియోగ్రఫీ చేసిన తనకు వచ్చిన రెమ్యూనరేషన్ లో రూ. 18 లక్షలను డాన్సర్స్ బీమా కోసం ఉపయోగిస్తానని జానీ మాస్టర్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

‘లెనిన్’ 3 డేస్ కలెక్షన్స్.. అయ్యగారు ఫిఫ్టీ ప్లస్ నాటౌట్.. ఇక సెంచరీనే!

‘జురాసిక్ పార్క్’ డాక్టర్ అలన్ గ్రాంట్ కన్నుమూత

‘వారణాసి’లో చిన్నప్పటి మహేష్‌గా అభయ్ రామ్.. స్క్రీన్స్ ఉంటాయా!

Updated Date - Jul 13 , 2026 | 06:16 PM