Jo Sharma: గ్లామర్ అండ్ యాక్షన్ రోల్స్ చేయాలని ఉంది
ABN , Publish Date - May 06 , 2026 | 08:11 PM
అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో, దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘M4M’. ఈ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబైంది.
అమెరికన్ నటి జో శర్మ (Jo Sharma) ప్రధాన పాత్రలో, దర్శకుడు మోహన్ వడ్లపట్ల (Mohan Vadlapatla) తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘M4M (Motive For Murder)’. ఈ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబైంది. PVR Inox Pictures ద్వారా విడుదలవుతున్న ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో హీరోయిన్ జో శర్మ మీడియాకు చిత్ర విశేషాలను తెలిపారు. ఆమె మాట్లాడుతూ..
‘‘నా పేరు జో శర్మ. నేను శాన్ ఫ్రాన్సిస్కో (అమెరికా) నుంచి వచ్చాను. టాలీవుడ్, బాలీవుడ్ తరహాలో వస్తున్న నా డెబ్యూ మూవీ ‘M4M (మోటివ్ ఫర్ మర్డర్)’. ఈ సినిమా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో మే 8న విడుదలకాబోతోంది. మోహన్ వడ్లపట్ల ఈ సినిమాకు దర్శకులు. ఇందులో నా పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. ‘రాధ’ పాత్రలో నేనొక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా కనిపిస్తాను. నేను అమెరికాలో థియేటర్ ఆర్టిస్ట్‌ని, నాకంటూ ఒక థియేటర్ ప్రొడక్షన్ కంపెనీ కూడా ఉంది. ఈ సినిమా కోసం మూడేళ్లు శిక్షణ తీసుకున్నాను. ఈ సినిమాకు మోహన్, రాహుల్ అడవలతో కలిసి నేను కూడా కో-రైటర్‌గా పనిచేశాను. కథా చర్చల్లో పాల్గొనడం వల్ల నా పాత్రను చాలా బలంగా డిజైన్ చేసుకోగలిగాను.
రిలీజ్‌కు ముందే ఈ సినిమాకు చాలా అవార్డులు వచ్చాయి. మా సినిమాకు ఇప్పటి వరకు 15 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు వచ్చాయి. లాస్ ఏంజెల్స్ ఫిలిం ఫెస్టివల్ నుంచి బెస్ట్ ఫిలిం, లండన్ ఫిలిం ఫెస్టివల్ నుంచి బెస్ట్ డైరెక్టర్, న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్ నుంచి బెస్ట్ యాక్ట్రెస్, హాలీవుడ్, శాంటా మోనికా తదితర ఫిలిం ఫెస్టివల్స్‌లో ఉత్తమ నటిగా నాకు, ఉత్తమ దర్శకుడిగా మోహన్‌కు అవార్డులు వచ్చాయి. ముఖ్యంగా ప్రతిష్టాత్మక ‘కేన్స్’ (Cannes) ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమాను గ్లోబల్ ప్రీమియర్ వేశారు. అక్కడ తెలుగు సినిమాను సబ్-టైటిల్స్‌తో చూసిన విదేశీయులు కూడా ఆశ్చర్యపోయారు. అది మాకు దక్కిన చాలా అరుదైన గౌరవంగా భావిస్తున్నాము.
‘M4M (మోటివ్ ఫర్ మర్డర్)’ ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ఇందులో ఒక సీరియల్ కిల్లర్ ఉంటాడు. అతను హత్యలు చేసిన తర్వాత, ఆ మృతదేహాలను రాజా రవివర్మ, పికాసో వంటి గొప్ప పెయింటర్ల పెయింటింగ్స్ తరహాలో డెకరేట్ చేస్తాడు. ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు. ప్రతి సీన్ చాలా గ్రిప్పింగ్‌గా, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లా ఉంటుంది. సినిమాలో హీరోగా ఏసీపీ కృష్ణ పాత్ర ఉంటుంది. విడుదల రోజు ఈ సినిమాలో విలన్ ఎవరో చెబితే లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించాము. M4M అంటే ‘మోటివ్ ఫర్ మర్డర్’. ఈ హత్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి అనేది అసలు పాయింట్. ఈ టైటిల్‌కే అందరూ కనెక్ట్ అవుతున్నారు. ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. ఈ చిత్రాన్ని మోహన్ మీడియా క్రియేషన్స్, మెక్ క్వీన్ గ్రూప్ అమెరికా వారు సంయుక్తంగా నిర్మించారు. ఒక లక్ష డాలర్ల బడ్జెట్ స్థాయికి చేరుకుని, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. షూటింగ్ మొత్తం హైదరాబాద్‌లోనే చేశాం. చెన్నైకి చెందిన వసంత్ ఇసైపట్టాయ్ సంగీతం అందించారు.
నేను పుట్టింది హైదరాబాద్‌లోనే. పెరిగింది మాత్రం నాగ్‌పూర్, ముంబైలో. నాకు తెలుగుతో పాటు మరాఠీ, హిందీ బాగా వస్తాయి. మా అమ్మానాన్నలది విజయవాడ, గుంటూరు ప్రాంతాలు. నాకు టాలీవుడ్‌లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఇలా అందరూ ఇష్టమే. జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. నాకు డ్యాన్స్, యాక్టింగ్ అంటే ప్రాణం కాబట్టి, రాబోయే సినిమాల్లో మంచి గ్లామర్ అండ్ యాక్షన్ రోల్స్ చేయాలని ఉంది. ‘M4M’తో వస్తున్న నన్ను, మా టీమ్ అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. బ్యూటీ విత్ బ్రెయిన్స్ అనిపించుకోవడమే నా లక్ష్యం’’ అని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
Lavanya Tripathi: ఇకపై ప్రెగ్నెంట్ అని తెలిస్తే.. ఆ పని చేయను
Peddi Movie: ‘పెద్ది’ విషయంలో బుచ్చిబాబు స్ట్రాటజీ ఏంటి? ఓన్లీ రామ్ చరణేనా!
‘సన్ రైజర్స్’కు సపోర్ట్ చేస్తున్న ఈ భామ ఎవరో గుర్తు పట్టారా?
Varanasi: ‘వారణాసి’కి వాటర్ కొరత!.. మహేష్ సినిమాకు ప్రభుత్వం షాక్!