సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న.. ‘జిమ్ జిమ్ తార’ పూర్తి ఒరిజిన‌ల్ పాట వ‌చ్చేసింది

ABN , Publish Date - Oct 14 , 2026 | 09:33 AM

పర్ణశాల సినిమా నుంచి ‘జిమ్ జిమ్ తార’ పూర్తి పాటను ఆదిత్య మ్యూజిక్ అధికారికంగా విడుదల చేసింది. జి. లక్ష్మీదేవి రాసి పాడిన ఈ పాట ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వినూత్న ప్రచార వ్యూహాలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్న హారర్ కామెడీ చిత్రం ‘పర్ణశాల’ (Parnasala Movie) నుంచి ‘జిమ్ జిమ్ తార’ (Jim Jim Taara Full Song) పాట పూర్తి వెర్షన్‌ను ఆదిత్య మ్యూజిక్ (Aditya Music) ద్వారా అధికారికంగా చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది. ‘పర్ణశాల’ మూవీ కోసం జి.ల‌క్ష్మిదేవి (G Lakshmidevi) రాసి పాడిన ఈ పాట ఇప్పటికే ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా అధికారికంగా పూర్తి పాట విడుద‌ల త‌ర్వాత సినిమాపై మ‌రింతా హైప్ పెరిగింది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వై.జి. భరత్ మాట్లాడుతూ.. “మా ప‌ర్ణ‌శాల సినిమా కోసం జి.ల‌క్ష్మిదేవి గారు రాసి పాడిన జిమ్ జిమ్ తార’ పాటకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన ఆనందాన్ని కలిగిస్తోంది. పూర్తి పాట విడుదల త‌ర్వాత అనూహ్య స్పంద‌న వ‌స్తోంది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటను అధికారికంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మరింత ఆనందంగా ఉంది. పూర్తి పాటకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుందని ఆశిస్తున్నాం” అని తెలిపారు.

పూర్తి పాట అధికారికంగా విడుదల కాకముందే, దీనికి సంబంధించిన బాణీ, వీడియోలు సోషల్ మీడియా వేదికలపై విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. పలువురు నెటిజన్లు ఈ పాటకు రీల్స్‌, వీడియోలు రూపొందిస్తుండగా, సెలబ్రిటీలు సైతం తమ సినిమాల ప్ర‌మోష‌న్ కోసం ఉపయోగించడం విశేషం.

ఎస్‌ఎల్‌టీ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత మంచి వెంకట్ నిర్మాణంలో వై.జి. భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. హారర్ కామెడీతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలను మేళవిస్తూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం, ఇప్పటికే తన వినూత్న ప్రచారంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ‘జిమ్ జిమ్ తార’ పాటకు లభిస్తున్న ఆదరణతో సినిమాపై ఇండ‌స్ట్రీలో అంచనాలు మరింత పెరిగాయి.

Updated Date - Oct 14 , 2026 | 09:33 AM