తారే జమీన్ పర్ తరహాలో తెలుగు సినిమా.. 'జయంత్ అండ్ ది జింగో పెన్‌'

ABN , Publish Date - Nov 11 , 2026 | 02:35 PM

మాస్టర్ జయంత్ బొలిశెట్టి నటించిన బాలల చిత్రం జయంత్ అండ్ ది జింగో పెన్ నవంబర్ 14న విడుదల కానుంది.

Jayanth and the Jingo Pen

నమో జయం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మించిన బాలల చిత్రం ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాస్టర్ జయంత్ బొలిశెట్టి, ఊహా రెడ్డి, సత్యం రాజేష్, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

బాలల దినోత్సవం సందర్భంగా విడుదలవుతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మంగళవారం నిర్వహించారు. ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు చిత్ర బృందాన్ని అభినందించారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. పిల్లలంతా కుటుంబంతో కలిసి చూసే మంచి సందేశాత్మక చిత్రాలు అరుదుగా వస్తున్నాయని, అలాంటి ప్రయత్నమే ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ అని ప్రశంసించారు. మాస్టర్ జయంత్ భవిష్యత్తులో మంచి నటుడిగా ఎదుగుతాడని ఆశాభావం వ్యక్తం చేశారు.

కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఒకప్పుడు ఏడాదికి 50కి పైగా బాలల చిత్రాలు వచ్చేవని గుర్తుచేశారు. మంచి కథతో రూపొందిన ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. పిల్లల్లోని ప్రత్యేక ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ఎంతో ముఖ్యమని అన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తప్పక చూడాల్సిన చిత్రమిదని పేర్కొన్నారు.

నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి తమ సినిమా మంచి భావోద్వేగాలతో సాగుతుందని, నవంబర్ 14న విడుదలవుతున్న చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.ప్రవీణ్ బొలిశెట్టి మాట్లాడుతూ.. ఈ సినిమాకు పాటలు, మాటలు రాసే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. మోహిత్ సంగీతం, కెమెరామెన్ ఆండ్రూ విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు. మలయాళ చిత్రం రీమేక్ హక్కులు తీసుకుని ఈ సినిమాను రూపొందించామని, ఏషియన్ సురేష్ ద్వారా విడుదల చేస్తున్నామని తెలిపారు.

ఆశిష్ గాంధీ మాట్లాడుతూ.. ఇందులో తాను విభిన్నమైన పాత్ర పోషించానని, పాటలు ఎంతో కొత్తగా ఉంటాయని చెప్పారు. ‘తారే జమీన్ పర్’ తరహాలో తెలుగులో ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకుడు నవీన్ దేశబోయిన మాట్లాడుతూ.. స్క్రిప్ట్ రూపకల్పనలో నిర్మాతలు ఎంతో సహకరించారని తెలిపారు. మాస్టర్ జయంత్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడని, ఈ సినిమాకు ప్రవీణ్ సాహిత్యం, సంగీతం, సంభాషణలు ప్రధాన బలమని పేర్కొన్నారు. మంచి బాలల చిత్రాలను ప్రోత్సహించడం అందరి బాధ్యతని అన్నారు.

మాస్టర్ జయంత్ తనను హీరోగా పరిచయం చేస్తున్న తల్లిదండ్రులకు, దర్శకుడు నవీన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సినిమాలో అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయని, పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి చూడాలని కోరారు. ఇక విజయేందర్ రెడ్డి, షఫి, కాశీ విశ్వనాథ్, అశోక్ కుమార్, సత్యం రాజేష్ తదితరులు కూడా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

Updated Date - Nov 11 , 2026 | 02:42 PM