పిల్లలకు గుడ్ న్యూస్.. రూ.250 టికెట్ రూ.150కే.. నవంబర్ 14న కొత్త సినిమా!
ABN , Publish Date - Nov 13 , 2026 | 12:05 PM
బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న విడుదలవుతున్న ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ సినిమాకు పిల్లల టికెట్ ధరను రూ.250 నుంచి రూ.150కి తగ్గించారు.
బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులకు ఓ ప్రత్యేక కానుక అందించేందుకు సిద్ధమైంది ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ (Jayanth and the Jingo Pen) చిత్ర బృందం. పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి ఈ సినిమాను థియేటర్లలో చూసేలా టికెట్ ధరలను తగ్గిస్తూ నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా రూ.250గా ఉన్న టికెట్ ధరను పిల్లల కోసం రూ.150కి తగ్గించినట్లు నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి వెల్లడించారు. నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
నమో జయం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన దర్శకత్వం వహించారు. మాస్టర్ జయంత్ బొలిశెట్టి, ఊహా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. సత్యం రాజేష్, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, మానిక్ రెడ్డి, అశోక్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
సినిమా విడుదల నేపథ్యంలో నిర్వహించిన కార్యక్రమంలో చిత్ర బృందం పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ సందర్భంగా పాటల రచయిత ప్రవీణ్ బొలిశెట్టి మాట్లాడుతూ.. సినిమాలో తాను రాసిన పాటలకు మంచి స్పందన లభించిందని తెలిపారు. బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న సినిమాను విడుదల చేస్తున్నామని, పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని చెప్పారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు సినిమాలో ఉన్నాయని పేర్కొన్నారు.
హీరో మాస్టర్ జయంత్ బొలిశెట్టి మాట్లాడుతూ.. బాలల దినోత్సవం సందర్భంగా తమ సినిమాను విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. చిన్నారులు కూడా సినిమా చూసేలా టికెట్ ధరను రూ.250 నుంచి రూ.150కి తగ్గించినట్లు తెలిపారు. పిల్లలతో పాటు పెద్దలు, ఉపాధ్యాయులకు కూడా మంచి సందేశాన్ని అందించే చిత్రమిదని పేర్కొన్నారు.
నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి మాట్లాడుతూ.. సినిమాలోని భావోద్వేగాలు ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయని అన్నారు. పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్లు తప్పకుండా ఈ సినిమాను చూడాలని కోరారు. ఈ సందర్భంగా ‘పిల్లల మార్కులు కాదు.. మనసులు చూడండి’ అంటూ తల్లిదండ్రులకు ఓ ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు.
సహ నిర్మాత షఫీ మాట్లాడుతూ.. చిన్నారులకు బాలల దినోత్సవ కానుకగా ఈ సినిమాను అందిస్తున్నామని చెప్పారు. అందుకే టికెట్ ధరను రూ.250 నుంచి రూ.150కి తగ్గించామన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మంచి స్పందన వస్తోందని, కొన్ని చోట్ల థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతున్నాయని వెల్లడించారు. మొదటి నుంచీ పిల్లల కోసమే ఈ సినిమాను రూపొందించామని, నవంబర్ 14న ప్రేక్షకులంతా థియేటర్లకు వచ్చి ఆదరించాలని కోరారు.
దర్శకుడు నవీన్ దేశబోయిన మాట్లాడుతూ.. ఈ సినిమాను కేవలం వ్యాపార కోణంలో చూడటం లేదని, పిల్లలకు మంచి అనుభూతిని అందించాలనే ఉద్దేశంతోనే టికెట్ ధరలను తగ్గించామని తెలిపారు. ఇప్పటికే పలు పాఠశాలల నుంచి థియేటర్ బుకింగ్స్ జరుగుతున్నాయని చెప్పారు. పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి ఈ సినిమాను చూడాలని కోరారు.
మొత్తానికి బాలల దినోత్సవం రోజున చిన్నారులకు వినోదంతో పాటు మంచి సందేశాన్ని అందించాలనే లక్ష్యంతో ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ సిద్ధమవుతోంది. ముఖ్యంగా టికెట్ ధరను తగ్గించడం ద్వారా ఎక్కువ మంది పిల్లలకు సినిమాను చేరువ చేయాలనే చిత్ర బృందం ప్రయత్నం ఆసక్తిని కలిగిస్తోంది.