సాయి పల్లవితో ‘జయమ్ము నిశ్చయమ్మురా 2’ ప్రారంభం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ABN , Publish Date - Oct 13 , 2026 | 10:13 PM
జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి’ సీజన్ 2 అక్టోబర్ 16 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. తొలి ఎపిసోడ్‌లో సాయి పల్లవి సందడి చేయనున్నారు.
ప్రముఖ నటుడు జగపతిబాబు (Jagapathi Babu) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి’ (Jayammu Nischayammura) రెండో సీజన్ ప్రారంభమవుతోంది. ఈసారి తొలి ఎపిసోడ్‌లో నటి సాయి పల్లవి (Sai Pallavi) సందడి చేయనున్నారు. తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరైన హై బ్రీడ్ పిల్ల.. ఈ షోలో తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జ్ఞాపకాలు, తన ఆలోచనలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకోనున్నారు.
తొలి సీజన్‌లో నాగార్జున, శ్రీలీల వంటి ప్రముఖులు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు, సినీ రంగంలో ఎదురైన అనుభవాలు, మరచిపోలేని సంఘటనలపై జగపతిబాబు జరిపే సంభాషణలు ఈ షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇప్పుడు రెండో సీజన్‌లోనూ ఇదే తరహాలో ఆసక్తికరమైన ముచ్చట్లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
సాయి పల్లవి ఎపిసోడ్‌పై ఆసక్తి పెరగడానికి మరో కారణం ‘రామాయణ’ సినిమా. ఈ చిత్రంలో ఆమె సీత పాత్రలో కనిపించనుండటంతో, ఆమె గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో జగపతిబాబుతో జరిగే సంభాషణలో తన కెరీర్‌కు సంబంధించిన విశేషాలతో పాటు, ప్రేక్షకులకు పెద్దగా తెలియని విషయాలను సాయి పల్లవి వెల్లడించనున్నట్లు షో నిర్వాహకులు తెలిపారు.
ఇదిలాఉంటే.. ‘జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి’ సీజన్ 2 అక్టోబర్ 16 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 18, ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. సాయి పల్లవితో ప్రారంభమవుతున్న ఈ కొత్త సీజన్‌లో ఇంకా ఎస్థాయి సెలబ్రిటీలు వస్తారో, ఎలాంటి ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తాయో చూడాలి.