వడ్డీకాసులవాడిగా కాంట్రవర్సీ హీరో.. జనాలు ఒప్పుకుంటారా
ABN , Publish Date - Aug 05 , 2026 | 03:03 PM
రీఎంట్రీలో మిరాయ్ సినిమాలో విలన్‌గా మెప్పించిన మనోజ్ ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తూనే రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు.
మంచు వారబ్బాయి మంచు మనోజ్ (Manchu Manoj) కి రీఎంట్రీ బాగా కలిసొచ్చింది. ఒకప్పుడు హీరోగా మంచి మంచి సినిమాల్లో నటించి మెప్పించిన మనోజ్.. కొన్ని పర్సనల్ కారణాల వలన ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చాడు. ఆ తరువాత ఆ సమస్యలను మొత్తం పరిష్కరించి మళ్లీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. ఈసారి హీరోగా కాకుండా సంపూర్ణ నటుడిగా మారడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒకపక్క హీరోగా నటిస్తూనే.. ఇంకోపక్క విలన్ గా కూడా విజృంభిస్తున్నాడు. రీఎంట్రీలో మిరాయ్ సినిమాలో విలన్‌గా మెప్పించిన మనోజ్ ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తూనే రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. అందులో ఒకటి డేవిడ్ రెడ్డి. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఇక మనోజ్ హీరోగా నటిస్తోన్న మరో చిత్రం వడ్డీ కాసుల వాడ. తేజ్ ఉప్పలపాటి అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి కారణం.. ఒకప్పుడు మనోజ్ కామెడీ చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇప్పుడు వడ్డీ కాసుల వాడ కూడా అలాంటి వినోదాత్మక కథతో వస్తుండటంతో అంచనాలు పెరిగాయి. శ్రీ వేంకటేశ్వరస్వామికి, ఆయన భక్తుడికి మధ్య సాగే కథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో వేంకటేశ్వరస్వామిగా తమిళ నటుడు రవి మోహన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు మూలాలున్న జయం రవికి ఇది మొదటి సారి నేరుగా నటిస్తున్న తొలి తెలుగు చిత్రం కావడం గమనార్హం.
ఇక రవి మోహన్ వడ్డీ కాసుల వాడిగా కనిపిస్తున్నాడు అన్న వార్త తెలియడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. నటుడిగా రవి మోహన్ కి పేరు పెట్టాల్సిన పని లేదు. కానీ, ఈమధ్య ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఎన్నో వివాదాలకు దారితీసాయి. భార్య ఆర్తితో విడాకుల గొడవ.. సింగర్ కెనీషాతో రిలేషన్ లో ఉండడం.. ఆయన మానసికంగా క్రుంగిపోవడం జరిగాయి. ఇన్ని వివాదాల మధ్య ఆయన దేవుడి పాత్రలో కనిపిస్తుండడంపై పలువురు పలు రకాలుగా మాట్లాడుతున్నారు. మరి ఈ పాత్రలో రవి మోహన్ ని తెలుగు ప్రేక్షకులు ఒప్పుకుంటారా.. లేదా.. అనేది తెలియాల్సి ఉంది.