తాత కృష్ణ సొంతూరులో.. జయ కృష్ణ సందడి
ABN , Publish Date - Jul 12 , 2026 | 10:48 PM
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బుర్రిపాలెం, తెనాలిలో సందడి చేశారు.
సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మనవడు, సినీ హీరో జయకృష్ణ (Jaya Krishna Ghattamaneni) ఆదివారం తెనాలిలో సందడి చేశారు. ఆయన హీరోగా నటించిన 'శ్రీనివాస మంగాపురంస (Srinivasa Mangapuram) సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ రషా తడాని (Rasha Thadani), దర్శకుడు అజయ్ భూపతి (Ajay Bhupathi), చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి ఉదయం బుర్రిపాలెంలోని సూపర్ స్టార్ కృష్ణ స్వగృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణ (Krishna) విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
జయకృష్ణ రాకతో బుర్రిపాలెంలో అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం గ్రామంలోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బుర్రిపాలెం గ్రామస్తులు, ఘట్టమనేని అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. తాను నటించిన 'శ్రీనివాస మంగాపురం' చిత్రం ఎంతో బాగా వచ్చిందని, ప్రేక్షకుల ఆదరణతో సినిమా తప్పకుండా సూపర్ హిట్‌గా నిలుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అనంతరం అభిమానులతో ఫోటోలు, సెల్ఫీలు దిగుతూ వారిని ఉత్సాహపరిచారు.
అదే విధంగా బుర్రిపాలెం నుంచి విజయవాడకు బయలుదేరిన జయకృష్ణకు తెనాలిలో సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు అభిమానులు ఘన స్వాగతం పలికారు. బుర్రిపాలెం రోడ్డులోని పెట్రోల్ బంక్ సమీపంలో ఫ్యాన్స్ నాయకులు కె. యశ్వంత్ కుమార్, షబ్బీర్, అఖిల్ తదితరులు జయకృష్ణకు భారీ గజమాల వేసి స్వాగతం పలికారు. బాణాసంచా కాల్చుతూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
అక్కడి నుంచి ప్రదర్శనగా శివాజీ చౌక్, గాంధీచౌక్, ఐతానగర్ సెంటర్ మీదుగా తెనాలి బండ్‌కు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి హీరో జయకృష్ణ, హీరోయిన్ రషా తడాని, దర్శకుడు అజయ్ భూపతి, అభిమానుల నాయకులు కె. యశ్వంత్ కుమార్, ఈదర వెంకట పూర్ణచంద్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జయకృష్ణ పర్యటనతో తెనాలి, బుర్రిపాలెం ప్రాంతాల్లో అభిమానుల సందడి నెలకొంది.