జానీ, సుమలత మాస్టర్స్‌కు ఫెడరేషన్ షాక్.. ఆ విరాళం రిటన్!
ABN , Publish Date - Aug 19 , 2026 | 08:55 PM
హైదరాబాద్‌లో జరిగిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యవర్గ సమావేశంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా జానీ, సుమలత మాస్టర్స్‌కు ఫెడరేషన్ షాకిచ్చింది.
హైదరాబాద్‌లో జరిగిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యవర్గ సమావేశంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ సమావేశంలో డాన్సర్స్ అసోసియేషన్ మినహా మిగిలిన 23 క్రాఫ్ట్స్‌కు చెందిన ప్రతినిధులంతా పాల్గొని డాన్సర్స్ యూనియన్‌లో నెలకొన్న తాజా వివాదాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని (Anil Vallabhaneni) మీడియా సమావేశంలో పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. యూనియన్ నాయకులు చేసిన తప్పుల వల్ల సామాన్య డాన్సర్లకు అన్యాయం జరగకూడదని, ఫెడరేషన్ నిర్ణయాలకు కట్టుబడి ఉన్న ప్రతి డాన్సర్‌కు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు.
డాన్సర్స్ యూనియన్ ప్రస్తుత కార్యవర్గానికి ఫెడరేషన్ నుంచి ఎలాంటి సహకారం అందదని ఆయన తేల్చిచెప్పారు. ‘‘మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ వంటి ఇండస్ట్రీ పెద్దలు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఫెడరేషన్ సూచనలను ఏమాత్రం లెక్కచేయకుండా సుమలత (Sumalatha) డాన్సర్లను రెచ్చగొట్టి ఫెడరేషన్‌ను ధిక్కరిస్తూ ఎన్నికలు నిర్వహించారు. వారి స్వేచ్ఛకు మేం భంగం కలిగించం కానీ, వారి కార్యవర్గ నిర్ణయాలతో మాకు ఎలాంటి సంబంధం లేదు. వారిపై సహాయ నిరాకరణ కొనసాగుతుంది. అలాగే జానీ మాస్టర్ (Jani Master)పై ఉన్న సస్పెన్షన్‌ను కొనసాగిస్తున్నాం. ఇది 23 యూనియన్ల ఏకాభిప్రాయ నిర్ణయం. అంతేకాకుండా గతంలో జానీ మాస్టర్ ఫెడరేషన్‌కు విరాళంగా ఇచ్చిన మూడు లక్షల రూపాయలను తిరిగి ఆయనకే పంపించేస్తున్నాం’’ అని అనిల్ వల్లభనేని ప్రకటించారు.
ఇక సినీ కార్మికుల వేతనాల పెంపు ప్రక్రియ వేగంగా జరుగుతోందని, సెప్టెంబర్ నాటికి దీనిపై పూర్తి క్లారిటీ వస్తుందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా టికెట్ రేట్ల పెంపులో 20 శాతం మొత్తాన్ని కార్మికుల సంక్షేమానికి కేటాయించాలని ఇప్పటికే జీవో ఇచ్చారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు ఆ బ్యాలెన్స్ మొత్తాన్ని వెంటనే ఫెడరేషన్ వెల్ఫేర్ అకౌంట్‌లో జమచేసి సినీ కార్మికుల సంక్షేమానికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. ఫెడరేషన్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయాలు ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
ఫాంటసీ కామెడీతో.. దసరా బరిలోకి యామీ గౌతమ్
శుక్రాచార్య.. ‘మహాకాళి’ నుంచి బిగ్ అప్‌డేట్‌కు డేట్ ఫిక్స్
మోక్షజ్ఞ ఎంట్రీ లిస్ట్‌లోకి మరో దర్శకుడు.. ఈసారైనా నమ్మవచ్చా