Shrasti Verma: బీజేపీలో చేరిన.. జానీ మాస్టర్ శిష్యురాలు
ABN , Publish Date - Aug 17 , 2026 | 04:18 PM
ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ (Shrasti Verma) రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ (Shrasti Verma) రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీ తెలంగాణ (Telangana BJP) రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు (N. Ramchander Rao) శ్రష్టి వర్మకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆమెతో పాటు పలువురు ఈ సందర్భంగా బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా రామచందర్‌రావు మాట్లాడుతూ.. యువత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే శక్తులు ఒక్కటవుతున్న సమయంలో యువత రాజకీయాల్లోకి రావడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్ ఇటావాలో జన్మించిన శ్రష్టి వర్మ ఇంటర్ వరకు చదివింది. చిన్న వయసులోనే డ్యాన్స్‌పై ఆసక్తితో ఈటీవీలో ప్రసారమైన ‘ఢీ’ డ్యాన్స్ షో ద్వారా బుల్లితెరపైకి వచ్చారు. తొలుత కో-డ్యాన్సర్‌గా కనిపించిన ఆమె.. ఆ తర్వాత ‘ఢీ జోడీ’లో తన ప్రతిభతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఆపై అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన శృష్టి వర్మ క్రమంగా స్టార్ హీరోల సినిమాల్లో పాటలకు కొరియోగ్రఫీ చేసే స్థాయికి ఎదిగింది.

ఈ క్రమంలోనే.. శృష్టి వర్మ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై చేసిన లైంగిక ఆరోపణలు పెను సంచలనం సృష్టించగా జాతీయ స్థాయిలో పెద్ద చర్చ జరిగింది. అంతేగాక జానీ మాస్టర్ పోక్సో కేసులో జైలుకు కూడా వెళ్లారు. అదే సమయంలో అల్లు అర్జున్ ‘పుష్ప 2’లోని ‘సూసేకి’ పాటకు కొరియోగ్రఫీ చేయడం ద్వారా శ్రష్టి వర్మ పేరు మారుమ్రోగింది. అంతకుముందు రజనీకాంత్ ‘జైలర్’ సినిమాలోని ‘నువ్వు కావాలయ్యా’ పాటకు కూడా ఆమె నృత్యరీతులు సమకూర్చారు. ‘క్రాక్’, ‘బీస్ట్’, ‘అల వైకుంఠపురములో’, ‘గేమ్ ఛేంజర్’, ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’, ‘మనమే’ తదితర చిత్రాలకు ఆమె కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆపై ‘బిగ్ బాస్ సీజన్ 9’లో కంటెస్టెంట్‌గా పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.
అయితే.. జానీ మాస్టర్ జైలు నుంచి వచ్చిన అనంతరం అడపాదడపా శృష్టివర్మ తిరిగి పలుమార్లు ఆరోపణలు చేస్తూ వస్తూనే ఉంది కానీ ఆ వార్తలకు అంతగా ప్రాధాన్యత దక్కలేదు. ఈ నేపథ్యంలోనే శ్రష్టి వర్మ సడన్‌గా బీజేపీలో చేరడంతో ఆమె పేరు మరోసారి వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆమె.. ఇకపై రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.