Janhvi Kapoor: టాలీవుడే దిక్కంటున్న పెద్ది బ్యూటీ..
ABN , Publish Date - Jan 09 , 2026 | 06:11 PM
అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi) వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. భారీ అంచనాలు, కోట్లాది మంది అభిమానుల నిరీక్షణ మధ్య ధడక్ సినిమాతో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) బాలీవుడ్ వెండితెరపై బాగానే మెరిసింది.
Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi) వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. భారీ అంచనాలు, కోట్లాది మంది అభిమానుల నిరీక్షణ మధ్య ధడక్ సినిమాతో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) బాలీవుడ్ వెండితెరపై బాగానే మెరిసింది. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత వరుస ప్రాజెక్టులతో బిజీగా మారింది. అయితే గడిచిన ఏడేళ్ల కెరీర్‌ను ఒక్కసారి విశ్లేషిస్తే, ఆమె ఖాతాలో చెప్పుకోదగ్గ భారీ విజయాలు నమోదు కాలేదనే చెప్పాలి. గ్లామర్ పరంగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నా, బాక్సాఫీస్ వద్ద మాత్రం జాన్వీకి నిరాశే ఎదురవుతోంది. ఇలాంటి తరుణంలో ఆమెకు టాలీవుడ్ దిక్కు కానుందని టాక్ వినిపిస్తుంది.
హిందీలో ఆశించిన స్థాయిలో సక్సెస్ రాకపోవడంతో, జాన్వీ తన రూటు మార్చింది. తన తల్లికి లైఫ్ ఇచ్చిన టాలీవుడ్ లోనే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా వచ్చిన దేవర సినిమా ఆమెకు ఒక ఊపిరి పోసింది. ఎన్టీఆర్ సరసన తంగం పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. గ్లామర్ తో పాటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేయడం ద్వారానే ఇక్కడ నిలదొక్కుకోగలమని ఆమె గ్రహించినట్లు కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు తన ఆశలన్నీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా పెద్ది పైనే పెట్టుకుంది.
ప్రస్తుతం జాన్వీ కపూర్ కెరీర్ లో అత్యంత కీలకమైన చిత్రం పెద్ది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ అచ్చియమ్మ అనే పల్లెటూరి యువతి పాత్రలో నటిస్తోంది. ఈ పాత్ర కోసం జాన్వీ తన లుక్ ను పూర్తిగా మార్చుకోవడమే కాకుండా, నటనలో కొత్త కోణాన్ని చూపించడానికి సిద్ధమైంది. కేవలం అందాల ప్రదర్శనకే పరిమితం కాకుండా, ఒక నటిగా తన సత్తా ఏంటో నిరూపించుకోవడానికి ఇది ఆమెకు ఆఖరి అవకాశం అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక ఇప్పటికే విడుదలైన చికిరి చికిరి సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. జాన్వీ ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్ చూస్తుంటే, ఈ సినిమాతో ఆమె టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ రేసులోకి వెళ్లడం ఖాయమనిపిస్తోంది. బాలీవుడ్ లో ఎన్నో ప్రయత్నాలు చేసినా దక్కని గుర్తింపును, టాలీవుడ్ అందిస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అమ్మ శ్రీదేవి లాగే సౌత్ ఇండస్ట్రీని ఏలుతుందా..? లేక కేవలం గ్లామర్ స్టార్‌గానే మిగిలిపోతుందా అన్న సందేహాలకు పెద్ది సినిమానే సమాధానం చెప్పాలి. సినిమా రిజల్ట్ తేడా కొడితే జాన్వీ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే ఈ సినిమా విజయం కోసం ఆమె రాత్రింబవళ్లు కష్టపడుతోంది. మరి అచ్చియమ్మగా జాన్వీ మాయ చేస్తుందో లేదో చూడాలి.