Jagapathi Babu: జగపతిబాబు నిరాడంబరతకు నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్!
ABN , Publish Date - Nov 27 , 2026 | 11:54 AM
వెండితెరపై విలన్గా కనిపిస్తే భయపెట్టగలరు.. గంభీరమైన పాత్రల్లో నటిస్తే తనదైన ముద్ర వేయగలరు. కానీ నిజ జీవితంలో మాత్రం ఆయన చాలా సరదాగా ఉంటారు.
వెండితెరపై విలన్గా కనిపిస్తే భయపెట్టగలరు.. గంభీరమైన పాత్రల్లో నటిస్తే తనదైన ముద్ర వేయగలరు. కానీ నిజ జీవితంలో మాత్రం ఆయన చాలా సరదాగా ఉంటారు. స్టార్డమ్ను పక్కనపెట్టి సామాన్యులతో కలిసిపోతారు. తన హోదా, స్థాయిని ఏమాత్రం పట్టించుకోకుండా అందరితో ఆప్యాయంగా మెలిగే ఆ నటుడే జగపతిబాబు (Jagapathi babu)
సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన ఆయన.. ఆ తర్వాత ఆర్థికంగా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. చిల్లిగవ్వ లేని పరిస్థితి నుంచి మళ్లీ తన కాళ్లపై తాను నిలబడి పూర్వ వైభవాన్ని కూడా దాటే స్థాయికి ఎదిగారు. నటుడిగా ఎన్నో విజయాలు అందుకున్నారు. అయినప్పటికీ ఆయనలోని నిరాడంబరత మాత్రం మారలేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మాటకు ఆయన వ్యక్తిత్వం ఉదాహరణగా నిలుస్తోంది.
తాజాగా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్గా మారింది. కొంతమంది వర్కర్లతో కలిసి ఆయన భోజనం చేశారు. వారు తెచ్చుకున్న ఆహారాన్ని స్వయంగా రుచి చూశారు. అంతేకాదు.. వారి కోసం ప్రత్యేకంగా బిర్యానీ తెప్పించి వారితో కలిసి కూర్చుని భోజనం చేశారు. తన స్టార్డమ్ను పక్కనపెట్టి వారితో సరదాగా గడిపిన తీరు నెటిజన్ల మనసులు గెలుచుకుంటోంది. ఇక ఈ వీడియోకు సంబంధించిన మరో సరదా విషయం అభిమానులను నవ్విస్తోంది. 'ఉదయం నాలుగు గిన్నెల అన్నం తిన్న జగ్గూభాయ్.. రాత్రి భోజనంతో ఊరందరినీ మించిపోయారు. ఏంటీ తిండిపోతుతనం!' అంటూ సరదాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు జగ్గూభాయ్ను ప్రశంసిస్తున్నారు. 'చాలామంది సంపాదిస్తారు.. మరికొందరు ఆ సంపదను అనుభవిస్తారు. కానీ సంపాదించిన దానికంటే మనుషులతో కలిసి మెలిసి ఉండటంలోనే నిజమైన ఆనందాన్ని వెతుక్కునేవారు చాలా తక్కువమంది ఉంటారు. అలాంటి వ్యక్తిత్వం ఉన్నవారిలో జగపతిబాబు ఒకరు. తెరపై ఎలాంటి పాత్రలో కనిపించినా.. నిజ జీవితంలో మాత్రం మనసున్న మనిషిగా మరోసారి ప్రశంసలు అందుకుంటున్నారు' అని ఓ నెటిజన్ పోస్ట్ చేశారు.