Jagapathi babu: దర్శకుడు చెప్పిందే చేసింది జాన్వీ
ABN , Publish Date - Jun 08 , 2026 | 12:58 PM
'పెద్ది’ చిత్రంలో జాన్వీ కపూర్ పాత్ర ట్రోల్ అవుతున్న నేపథ్యం ఇందులో అప్పల సూరిగా నటించిన జగపతిబాబు స్పందించారు.
'పెద్ది’ (Peddi) చిత్రంలో జాన్వీ కపూర్ పాత్ర ట్రోల్ అవుతున్న నేపథ్యం ఇందులో అప్పల సూరిగా నటించిన జగపతిబాబు (Jagapathi babu) స్పందించారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘రూ.300 కోట్లు పెట్టి సినిమా తీసినా.. రూ.300 పెట్టి చూసే ఆడియన్స్ చేతుల్లోనే ఇండస్ట్రీ తలరాత ఉంటుంది’ అన్నారు. 'ఈ సినిమా విషయంలో ఆర్టిస్టులను దయచేసి ట్రోల్ చేయవద్దు. జాన్వీకపూర్ దర్శకుడు ఏం చెప్పారో అదే చేసింది. కొన్నిసార్లు అది మిస్ ఫైర్ అవుతుంది. అన్ని అందరికీ నచ్చాలని రూల్ లేదు. ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి ఉంటుంది. ఈ విషయంలో నేను జాన్వీకి అండగా నిలబడతా. ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేయవద్దు. ట్రోలింగ్‌తో మానసికంగా ఇబ్బంది పెట్టొద్దు’ అని అన్నారు.
ఈ సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ ‘పెద్ది’ రిలీజ్ తర్వాత ఓ పెద్ద దర్శకుడు నాకు ఫోన్ చేసి ‘ఇందులో ఇంత గొప్ప పాత్ర పోషించినా ఎందుకు ఎవరూ గుర్తించలేదు. అదే పాత్రను వేరే భాషకు చెందిన ఆర్టిస్టులు చేసి ఉంటే బాగా హైలైట్ చేసేవారు. మరో 20 అవకాశాలిచ్చేవారు. మిమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు ఏంటి?’ అని అడిగారు. ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా ఇతర భాష నటులకు ఎక్కువ గౌరవం ఇస్తారు. నేను కన్నడలో చేస్తే అక్కడ బాగా గౌరవిస్తారు. నేను కూడా ‘పెద్ది’ విడుదలయ్యాక బుచ్చిబాబును ఒకటే ప్రశ్న అడిగా.. ‘షూటింగ్ అప్పుడు.. ప్రతి షాట్‌కు క్లాప్స్ కొట్టారు. ఇప్పుడేంటి ఎవరూ మాట్లాడటం లేదు. నన్ను మర్చిపోతున్నారా’ అని అడిగాను. ఈ సినిమా కోసం నేను ప్రాణం పెట్టాను. అందుకే నాకు గుర్తింపు కోసం అడిగే హక్కుంది. ఇంతకు ముందు చేసిన చిత్రాలకు నేనిలా అడగలేదు. ‘పెద్ది’కి ఇంకా ఆదరణ దక్కాలి. కచ్చితంగా దక్కి తీరుతుంది’ అన్నారు.