Jagapathi Babu: లైఫ్‌ ఇలా ఉందేంటని ఎప్పుడూ బాధపడలేదు..

ABN , Publish Date - May 29 , 2026 | 03:58 PM

నా కెరీర్‌ ఫ్లాప్‌ సినిమాతో మొదలై సక్సెస్‌ వైపు నడిచింది. అందుకే ఫెయిల్యూర్స్‌ని పెద్దగా పట్టించుకోను. అంతగా ప్రభావితం కాను. కష్టపడితే ఓ రోజు తప్పకుండా విజయం వరిస్తుందని మొదటి నుంచీ నమ్ముతా.


‘నా కెరీర్‌ ఫ్లాప్‌ సినిమాతో మొదలై సక్సెస్‌ వైపు నడిచింది. అందుకే ఫెయిల్యూర్స్‌ని పెద్దగా పట్టించుకోను. అంతగా ప్రభావితం కాను. కష్టపడితే ఓ రోజు తప్పకుండా విజయం వరిస్తుందని మొదటి నుంచీ నమ్ముతా. జీవితం ఎప్పుడూ అంచనాలకు అందదు. రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు కామన్‌గా ఉంటాయి. నేనూ ఎన్నో కష్టాలు పడ్డాను’ అని జగపతిబాబు (Jagapathibabu)అన్నారు.

‘పెద్ది’ (Peddi) సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నారాయన. ఇందులో అప్పల సూరిగా కనిపించనున్నారు. ఈ పాత్ర ఆయన కెరీర్‌ బెస్ట్‌, ఆయనకు ఎంతో నచ్చే కొన్ని సినిమాల్లో ఒకటిగా, మొదటి వరుసలో ఉంటుందని చెబుతున్నారు. రామ్‌చరణ్‌, జాన్వీ కపూర్‌ జంటగా బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.  

లుక్‌కి ఫిదా అయిపోయా..

‘ఈ సినిమా కథ రెండు, మూడ్లు లైన్లుగా విన్నాను. అంతకుమించి దర్శకుడు చెప్పలేదు. జస్ట్‌ లుక్‌ ఇలా ఉంటుందని చూపించాడు. అంతే ఆ లుక్‌ చూసి ఫిదా అయిపోయాను. ఎన్నో రకాల పాత్రలు చేశాను కానీ అప్పల సూరి లుక్‌ చూడగానే ఇలాంటి పాత్ర మళ్లీ దొరకదనిపించింది. వెంటనే ఓకే చేసేశా. అసలు బుచ్చికి ఇలాంటి ఐడియా ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. అప్పల సూరి ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ అయ్యాక చాలామంది నేను కాదనే అనుకున్నారు. వాయిస్‌ విన్నాక నేనని గ్రహించారు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే నా మిత్రుడు అక్కినేని వెంకట్‌ కూడా రెండుమూడుసార్లు చూసి నేను కాదనే అనుకున్నాడు. నా కెరీర్‌లో బెస్ట్‌ క్యారెక్టర్‌ అవుతుంది. ఇందులో నాకూ, రామ్‌చరణ్‌కు మధ్య సీన్స్‌ భలే ఉంటాయి. మా మధ్య బంధం అందరికీ నచ్చుతుంది. చరణ్‌ ఈ సినిమా కోసం ఎక్కువగా శ్రమించాడు’ అని అన్నారు.


కొత్త పాఠం నేర్చుకుంటూనే ఉన్నా..
వ్యక్తిగత విషయాల గురించి చెబుతూ ‘నేను సినిమాల విషయంలో  ఒత్తిడికి గురికాను. ఫ్యామిలీ ఇష్యూని తప్ప వేరే దేనిని పెద్ద సమస్యగా తీసుకోను.. చూడను. సినిమా రంగంలో ఉన్నంత ఆనందం నాకు ఎక్కడా ఉండదు. నా లైప్‌లో ఏదైనా ఆలస్యంగా వస్తుంది. కెరీర్‌ బిగినింగ్‌ అలాగే అయింది. తర్వాతే సక్సెస్‌ వచ్చింది. జీవితం అంచనాలకు అందదు. తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. ఈ జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాను. లైఫ్‌ ఇలా ఉందేంటి అని ఎప్పుడూ బాధపడలేదు. అనుభవాల నుంచి ఏదో ఒక కొత్త పాఠం నేర్చుకుంటూనే ఉన్నా. బాధ వెనక సంతోషం కచ్చితంగా ఉంటుందని నమ్ముతా. 2011 నుంచి 2013 వరకు ఎంతో బాధ అనుభవించా. దానికి తగిన ప్రతిఫలం సంతోషం రూపంలో ఇప్పుడు వచ్చింది. నా టైమ్‌ ఇప్పుడే స్టార్ట్‌ అయింది అనుకుంటున్నా’ అని అన్నారు.
 

Updated Date - May 29 , 2026 | 04:41 PM