'జబర్దస్త్‌' ఫేమ్‌ అభినయ కృష్ణ దర్శకత్వంలో 'కామాఖ్య'!

ABN , Publish Date - Mar 21 , 2026 | 09:22 AM

జబర్దస్త్‌ ఫేమ్ అదిరే అభి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రెండో సినిమా 'కామాఖ్య'. ఈ థ్రిల్లర్ మూవీ టీజర్ విడుదలైంది.

Kamakhya Movie Teaser launch

'జబర్దస్త్' కార్యక్రమంలో అదిరే అభిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్న అభినయ కృష్ణ (Abhinaya Krishna) దర్శకత్వంలో రెండో సినిమా రూపుదిద్దుకుంది 'కామాఖ్య' (Kamakhya). అతను గతంలో రాజ్ తరుణ్‌ (Raj Tharun) హీరోగా 'చిరంజీవా' చిత్రాన్ని రూపొందించారు. అది ఆహా ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్ అయ్యింది. ఇక తాజా చిత్రం 'కామాఖ్య'ను మాత్రం థియేటర్లలోనే రిలీజ్ చేయాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చారు. వడ్డేపల్లి శ్రీవాణీనాథ్‌, యశ్వంత్‌ రాజ్‌ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ లాంచ్ ఇటీవల జరిగింది. విశేషం ఏమంటే 'జబర్దస్త్' ఫేమ్‌ ధనరాజ్‌ దర్శకత్వం వహించిన 'రామం రాఘవం'లో కీలక పాత్ర పోషించిన సముతిరకని... అభినయ కృష్ణ 'కామాఖ్య'లోనూ ప్రాధాన పాత్రను పోషించారు. సమైరా, ఆనంద్, అభిరామి, శరణ్య ప్రదీప్, వైష్ణవ్, ధనరాజ్, రాఘవ, ఐశ్వర్య ఇతర ప్రధాన పాత్రలను పోషించారు.


కామాఖ్య అమ్మవారి పవర్ నాకు తెలుసు: సముతిరకని

టీజర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సముతిరకని (Samuthirakani) మాట్లాడుతూ, 'అభిరామి (Abhirami) మేడం గారికి నేను అభిమానిని. వారితో కలిసి నటిస్తున్న రెండో సినిమా ఇది. మరెన్నో చిత్రాలు కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా టైటిల్ కామాఖ్య అని చెప్పగానే మరో ఆలోచన లేకుండా చేసేద్దాం అని చెప్పాను. ఆ పవర్ నాకు తెలుసు. నా కెరీర్ లో ఒక ప్రాజెక్టు విషయంలో చాలా ఆలస్యం అయింది. ఆ సమయంలో అమ్మవారి దర్శనం కోసం వెళ్లాను. అక్కడ ఓ ఋషి నన్ను పేరుతో పిలిచి మాట్లాడారు. ఆ సందర్భంలో నా ప్రాజెక్ట్స్ సంగతి చెప్పాను. దర్శనం చేసుకొని వెళ్ళు... అయిపోతుంది అన్నారు. తమిళనాడు ల్యాండ్ అయిన వెంటనే హీరోతో మీటింగ్ అనే మెసేజ్ వచ్చింది. అదీ అమ్మవారి పవర్. సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడి వెళ్లి అన్నదానం చేసి వచ్చాను. సరిగ్గా ఆరు నెలలకి అభి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పారు. చేసేద్దాం అన్నాను. ఇది ఎక్స్ ట్రార్డినరీ మూవీ. అమ్మవారి అనుగ్రహం అందరిపై వుండాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.

అప్పుడు యమధర్మరాజు... ఇప్పుడు కామాఖ్య అమ్మవారు: అభినయ కృష్ణ

దర్శకుడు అభినయ కృష్ణ మాట్లాడుతూ, 'నా మొదటి చిత్రం 'చిరంజీవా'. ఆ సినిమాలో యమధర్మరాజుకి ఒక గుడి ఉందని, అది తెలంగాణలోనే ఉందని చెప్పడం జరిగింది. కామాఖ్య అమ్మవారి నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఒక ఉత్కంఠభరితంగా ప్రజెంట్ చేస్తూ మీ ముందుకు తీసుకు వస్తున్నాం. ఇందులో నటించిన వారంతా సహజంగా వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు. నా స్నేహితుడు రిశాంక్, అలాగే 'బాహుబలి'కి పనిచేస్తున్నప్పుడు సెంథిల్ గారి దగ్గర పరిచయమైన రమేష్.. మేము ముగ్గురం కలిసి ఈ కథను ముందుకు తీసుకెళ్ళాం. అనుకున్న సమయంలో అనుకున్న బడ్జెట్లో ఈ సినిమాని తీయగలిగాం. 'దృశ్యం' సినిమా తరహాలో ఉండే మంచి థ్రిల్లర్ ఇది. త్వరలో ఈ సినిమా మీ ముందుకు రాబోతోంది. ఒక నటుడిగా నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. అలాగే ఇప్పుడు దర్శకుడుగా కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను' అని అన్నారు.


గతంలో చేయని పాత్ర: అభిరామి

నటి అభిరామి మాట్లాడుతూ, 'కామాఖ్య బ్యూటిఫుల్ ఫిలిం. ఇప్పటివరకు నేను ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. నన్ను ఇంత కొత్తగా చూపించిన డైరెక్టర్ అభిగారికి థాంక్యూ సో మచ్. ఈ సినిమాలో పనిచేస్తున్న యాక్టర్స్ టెక్నీషియన్స్ అందరు కూడా చాలా ప్రతిభావంతులు. ఒక చిన్న సినిమా వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. టీం అందరూ కూడా ఈ సినిమా కోసం కలిసికట్టుగా పనిచేశారు. ఈ సినిమాకి సపోర్ట్ చేస్తూ ఆడియన్స్ వద్దకి తీసుకువెళ్లాలని మీడియా వారిని కోరుతున్నాను. తప్పకుండా అందరూ కూడా ఈ సినిమాని థియేటర్స్ లో చూడాలని ఆశిస్తున్నాను' అని అన్నారు.

ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్న సమైరా మాట్లాడుతూ, 'నా తొలి చిత్రం ఫిమేల్ సెంట్రిక్‌గా ఉండడం, అలాగే 'కామాఖ్య' అనే అనే పవర్ఫుల్ టైటిల్ ఈ సినిమాకి ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చిత్రంలో నటించిన సీనియర్ నటీనటులు చాలా మంచి సూచనలు ఇచ్చారు. దర్శకులు అభి ఈ సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దారు. నాకు ఈ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఇది చాలా మంచి థ్రిల్లర్ మూవీ' అని చెప్పారు. ఇది తమకు స్పెషల్ ప్రాజెక్ట్ అని, మంచి క్లారిటీతో చిత్ర బృందం దీనిని చక్కగా తెరకెక్కించిందని ప్రొడ్యూసర్‌ వాణీనాథ్‌ అన్నారు.

Updated Date - Mar 21 , 2026 | 09:22 AM