జబర్దస్త్ ఆర్టిస్టులు దొరబాబు, రైజింగ్ రాజుకు ఘోర రోడ్డు ప్రమాదం

ABN , Publish Date - Nov 22 , 2026 | 02:01 PM

ఈమధ్య టాలీవుడ్ స్టార్స్ ఎక్కువగా రోడ్డు ప్రమాదలకు గురవుతున్నారు. మొన్నటికి మొన్న ఢీ షో కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ కారు ప్రమాదానికి గురైంది. ఆ తరువాత శేఖర్ మాస్టర్ కి కూడా చిన్న ప్రామాదం జరిగింది.

Jabardasth

ఈమధ్య టాలీవుడ్ స్టార్స్ ఎక్కువగా రోడ్డు ప్రమాదలకు గురవుతున్నారు. మొన్నటికి మొన్న ఢీ షో కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ కారు ప్రమాదానికి గురైంది. ఆ తరువాత శేఖర్ మాస్టర్ కి కూడా చిన్న ప్రామాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో శేఖర్ మాస్టర్ కి ఎలాంటి గాయాలు కాలేదు. తాజాగా బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితులైన కమెడియన్లు దొరబాబు (Dorababu), రైజింగ్ రాజు (Rising Raju) ప్రయాణిస్తున్న కారుకు రోడ్డు ప్రమాదం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని పాలకోడేరు మండలం గోరగనమూడి వద్ద అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కాకినాడలో జనసేన అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.


వీరు ప్రయాణిస్తున్న కారు అకస్మాత్తుగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఒక స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో కారులో ఉన్న దొరబాబు, రైజింగ్ రాజుకు గాయాలవ్వగా, కారు నడుపుతున్న డ్రైవర్‌కు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాద శబ్దం విని వెంటనే స్పందించిన స్థానికులు, క్షతగాత్రులను కారులో నుంచి బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.


ప్రస్తుతం దొరబాబు, రైజింగ్ రాజుతో పాటు డ్రైవర్ భీమవరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదని, ఇద్దరికీ స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పాలకోడేరు పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. జబర్దస్త్ కమెడియన్లకు ప్రమాదం జరిగిందన్న వార్త తెలియడంతో అభిమానులు, తోటి కళాకారులు ఆందోళన వ్యక్తం చేస్తూ వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Updated Date - Nov 22 , 2026 | 02:02 PM