GONDHAL: ఇండియన్ అఫీషియల్ ఆస్కార్ ఎంట్రీ.. తెలుగులోనూ వచ్చేస్తోంది
ABN , Publish Date - Oct 28 , 2026 | 04:23 PM
మనం దేశం నుంచి ఆస్కార్‌కు అధికారికంగా ఎంపికైన మరాఠీ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం గోంధాల్ తెలుగులో సందడి చేయడానికి రెడీ అయింది.
ఈ ఏడాది ఉత్తమ అంతర్జాతీయ చిత్రం కేటగిరిలో మనం దేశం నుంచి మరాఠీ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం గోంధల్ ఆస్కార్‌కు (India's Oscar entry) అధికారికంగా ఎంపికైన విషయం తెలిసిందే. సంతోష్ దవఖర్ స్వయంగా రచించడంతో పాటు, దర్శకత్వం వహించి నిర్మాతగా వ్యవహరించాడు. కిషోర్ కదమ్ (Kishor Kadam), ఇషితా దేశ్‌ముఖ్ (Ishita Deshmukh), యోగేష్ సోహోని (Yogesh Sohoni), నిషాద్ భోయిర్ (Nishad Bhoir), అనుజ్ ప్రభు (Anuj Prabhu) కీతక పాత్రలు పోషించారు.
గతేడాది నవంబర్‌లో థియేటర్లలో కేవలం మరాఠి భాషలో మాత్రమే విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మన దేశంలో గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, 6 ఫిలిం ఫేర్ తో పాటు జాతీయంగా, అంతర్జాతీయంగా అనేక అవార్డులు సొంతం చేసుకుంది. అలాంటి ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో ప్రేక్షకుల ఎదుటకు వచ్చేందుకు సిద్దమైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు.
మహారాష్ట్రలోని ఓ గ్రామంలో కొత్తగా వివాహం చేసుకున్న కొత్త జంట కోసం ఓ రోజు రాత్రి సాంప్రదాయ భక్తి కార్యక్రమం గోంధాల్ నిర్వహిస్తారు. ఆ సమయంలో వధువు, ఆ గ్రామ ప్రజల చుట్టూ జరిగే వింత వింత పరిణామాల నేపథ్యంలో ఒక రోజు రాత్రిలో జరిగే సినిమాగా తెరకెక్కించారు. సినిమా ఆరంభంలో వచ్చే 25 నిమిషాల నిడివి గల సన్నివేశం ఈ సినిమాకు భారీ ఆకర్షణ కాగా భారతీయ సినిమా చరిత్రలో ఓ అరుదైన రికార్డును నమోదు చేసుకుంది. ఇళయరాజా అందించిన సంగీతం మరో లెవల్‌లో ఉంది.
తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా అనేక చిక్కుముడులతో ఊహించని మలుపులతో సాగింది. డబ్బింగ్ కూడా బాగా సెట్ అయింది. హోంబలే ఫిలింస్ (Hombale Films) ఈ సినిమాను నవంబర్ 13న మరాఠీతో పాటు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోకి అనువాదం చేసి రిలీజ్ చేస్తున్నారు.