Pongal Movies: సంక్రాంతి నెంబర్ వన్ సినిమా ఏదంటే..

ABN , Publish Date - Jan 15 , 2026 | 09:14 PM

చాలా ఏళ్ళ తరువాత టాప్ స్టార్స్ తో పాటు కాసింత పేరున్న తారల చిత్రాలు పొంగల్ బరిలో దూకడం చూశాం. ఈ సారి ఏకంగా ఐదు సంక్రాంతి సినిమాలు జనం ముందు నిలిచాయి.

Pongal Movies

Pongal Movies: చాలా ఏళ్ళ తరువాత టాప్ స్టార్స్ తో పాటు కాసింత పేరున్న తారల చిత్రాలు పొంగల్ బరిలో దూకడం చూశాం. ఈ సారి ఏకంగా ఐదు సంక్రాంతి సినిమాలు జనం ముందు నిలిచాయి. ఎవరికి వారు తమ చిత్రాల వసూళ్ళను ప్రకటించుకుంటూ సాగుతున్నారు. అయితే వాటిలో ఏది నంబర్ వన్ అన్నదే ప్రస్తుతం చర్చనీయాంశమయింది. పెట్టుబడికి తగిన రాబడి చూసే చిత్రాలను సక్సెస్ ఫుల్ మూవీస్ గా భావిస్తాం. అలాగే సదరు సినిమాల వసూళ్ళను బట్టి ఏది నంబర్ వన్ అని తేల్చవచ్చు. ఆ రీతిన చూస్తే అన్ని విధాల చిరంజీవి (Chiranjeevi) హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో రూపొందిన 'మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu)' మూవీని నంబర్ వన్ గా భావించవచ్చు. ఈ సినిమాకు మొదటి రోజు నుంచీ పాజిటివ్ బజ్ కొనసాగుతోంది. అలాగే రెండు రోజులకే ఈ చిత్రం 120 కోట్ల రూపాయల గ్రాస్ ను పోగేసింది. తరువాతి రోజుల్లోనూ ఈ మూవీ అదే ఊపు కొనసాగించనుంది. ఈ నేపథ్యంలో 'మన శంకరవరప్రసాద్ గారు'ను నంబర్ వన్ అని ట్రేడ్ పండిట్స్ డిక్లేర్ చేశారు. ఈ చిత్రంలో మరో స్టార్ హీరో వెంకటేశ్ నటించడం కూడా సినిమాకు ప్లస్ పాయింట్ అని చెబుతున్నారు.

ఈ సారి సంక్రాంతి సంబరాల్లో అగ్రస్థానాన్ని 'మన శంకరవరప్రసాద్ గారు' ఆక్రమించగా, తరువాతి స్థానంలో నిలిచేది ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం కాసింత జటిలంగా ఉంది... ఎందుకంటే ప్రస్తుతానికి 'మన శంకరవరప్రసాద్ గారు' కంటే మూడు రోజులు ముందుగా వచ్చిన ప్రభాస్ 'ద రాజాసాబ్' వసూళ్ళ పరంగా పైచేయి అనిపించకుంది. అయితే ఈ చిత్రానికి మొదటి రోజు నుంచీ టాక్ అంతగా లేదు... అయినా ఈ మూవీ నాలుగు రోజులకే 201 కోట్లు సంపాదించింది... అయితే ఈ సినిమా పెట్టుబడికి, రాబడికి లెక్కలు తీస్తే ఈ చిత్రం పరాజయం బాట పట్టిందనే ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి.

ఇక రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' చిత్రం ఆయన మాస్ ఇమేజ్ కు దూరంగా జరిగి ఎంటర్ టైన్ మెంట్ తో తెరకెక్కింది. ఈ మూవీ కూడా గుడ్ టాక్ సంపాదించినా వసూళ్ళు అంతగా కనిపించడం లేదు... ఇక నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒకరాజు' మూవీ టాక్ ఎలా ఉన్నా, వసూళ్ళు బాగానే దండుకుంటోంది. మొదటి రోజునే ఈ సినిమా 22 కోట్లు పోగేసింది. దాంతో సేఫ్ ప్రాజెక్ట్ గానే భావిస్తున్నారు ట్రేడ్ పండిట్స్.

సంక్రాంతి బరిలో అన్నిటి కన్నా చివరగా దూకిన చిత్రం శర్వానంద్ నటించిన 'నారీ నారీ నడుమ మురారి'... ఈ మూవీ జనవరి 14వ తేదీ సాయంత్రం షోతో మొదలు కావడం విశేషం... మొదటి ఆటనుంచే ఈ మూవీ గుడ్ టాక్ సంపాదించింది... దాంతో అన్ని కేంద్రాలలో స్టడీ కలెక్షన్స్ తో సాగుతోంది... టాక్ ప్రకారం అన్ని చిత్రాల కన్నా మిన్నగా ఉన్నా, వసూళ్ళ పరంగా టాప్ స్టార్ చిరంజీవి మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు'తో పోటీ పడే చిత్రమేది లేదనే చెప్పాలి. అందువల్ల 'మన శంకరవరప్రసాద్ గారు' తరువాతి స్థానం శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి'కే దక్కుతుందని పలువురు భావిస్తున్నారు. ఏది ఏమైనా వసూళ్ళ పరంగా ఆర్డర్ వేస్తే అప్పుడు సంక్రాంతి బరిలో దూకిన సినిమాల స్థానాలు తెలుస్తాయి. అవి తేలాలంటే మరో వారం దాకా ఆగాల్సిందే.

Updated Date - Jan 15 , 2026 | 09:14 PM