అనిల్ చేతిలో.. బేబ‌మ్మ భ‌విష్య‌త్తు

ABN , Publish Date - Apr 06 , 2026 | 08:24 PM

తనదైన మార్కు కామెడీతో, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో వరుస విజయాలు అందుకుంటూ దర్శకుడు అనిల్ రావిపూడి ఆ పేరును సార్థకం చేసుకున్నారు.

Anil Ravipudi

టాలీవుడ్‌లో ‘హిట్ మెషీన్’ అనే పేరు సంపాదించుకోవడం సామాన్యమైన విషయం కాదు. కానీ తనదైన మార్కు కామెడీతో, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో వరుస విజయాలు అందుకుంటూ దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఆ పేరును సార్థకం చేసుకున్నారు. సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాను అందించి ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు ఈ దర్శకుడు. ఈ భారీ విజయం తర్వాత అనిల్ రావిపూడి తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఒక భారీ మల్టీస్టారర్‌గా ప్లాన్ చేస్తున్నారు.

విక్టరీ వెంకటేశ్ (Venkatesh Daggubati)తో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరోలుగా నటించబోతున్నారు. ఇప్పటికే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అనిల్ తన కెరీర్ ఆరంభంలో ‘పటాస్’ సినిమాతో లైఫ్ ఇచ్చిన హీరో కళ్యాణ్ రామ్. మరోవైపు ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో అనిల్-వెంకటేష్ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద నవ్వుల పువ్వులు పూయించింది. ఇలా తనకు అచ్చొచ్చిన ఇద్దరు హీరోలను ఒకే స్క్రీన్ పైకి తీసుకురావడం నిజంగా టాలీవుడ్‌లో ఒక సెన్సేషన్ అని చెప్పాలి.

ఈ సినిమాలో హీరోయిన్స్ ఎవరనే విషయంపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పుకార్లకు అనిల్ స్వయంగా చెక్ పెట్టారు. ఇటీవల ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (Love Insurance Kompany) ప్రీ-రిలీజ్ వేడుకలో పాల్గొన్న ఆయన, తన సినిమాలో ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి (Krithi Shetty) నటించబోతున్నట్లు స్పష్టం చేశారు. "కృతి శెట్టి ఇప్పటికే అన్ని భాషల్లో సినిమాలు చేసింది.. త్వరలోనే నాతో వర్క్ చేయబోతోంది. ఈ విషయం బయట ఇప్పటికే లీక్ అయిపోయింది కాబట్టి నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు" అంటూ తనదైన శైలిలో కన్ఫర్మ్ చేసేశారు.

కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి నటిస్తున్నట్లు క్లారిటీ రావడంతో ఆమె ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ‘ఉప్పెన’తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ భామకు ఆ తర్వాత ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. ప్రస్తుతం ఆమె కెరీర్ కాస్త నెమ్మదించిన సమయంలో అనిల్ రావిపూడి వంటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ రావడం కృతికి ఒక గొప్ప అవకాశమనే చెప్పాలి. ఈ సినిమా గనుక హిట్ అయితే టాలీవుడ్‌లో కృతి శెట్టి మళ్ళీ బిజీ హీరోయిన్ అయిపోవడం ఖాయం.

అయితే విక్టరీ వెంకటేష్ జోడీగా ఏ హీరోయిన్ మెరవబోతుందనే విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. సీనియర్ హీరోయిన్లలో ఒకరిని తీసుకుంటారా లేక మరో యంగ్ బ్యూటీకి ఛాన్స్ ఇస్తారా అనేది వేచి చూడాలి. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీతో పాటు, వెంకటేష్ టైమింగ్, కళ్యాణ్ రామ్ ఎనర్జీ తోడైతే బాక్సాఫీస్ వద్ద మరోసారి రికార్డులు తిరగరాయడం ఖాయం.

Updated Date - Apr 06 , 2026 | 08:27 PM