Rashmika Mandanna: విజయ్‌ను.. వెయ్యిసార్లైనా పెళ్లి చేసుకుంటా

ABN , Publish Date - Nov 22 , 2026 | 09:43 AM

రష్మిక మందన్న తన తాజా చిత్రం మైసా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇటలీ, థాయ్‌లాండ్‌లో యాక్షన్ శిక్షణ, అడవుల్లో ప్రమాదకర సన్నివేశాలు, షూటింగ్‌లో గాయాలు, విజయ్ దేవరకొండతో వివాహ జీవితం గురించి మనసులో మాట చెప్పింది.

Rashmika Mandanna

ఇప్పటిదాకా క్యూట్‌గా కనిపించింది.. ఇప్పుడు తనలోని రౌద్రరూపం చూపించేందుకు సిద్ధమైంది. చేతిలో ఆయుధం.. కళ్లలో కసి.. శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించే యాక్షన్‌తో.. గిరిజన మహిళ ‘మైసా’ (Mysaa) గా సరికొత్త అవతారంలోకి మారిన రష్మిక మందన్న (Rashmika Mandanna) చెబుతున్న తాజా కబుర్లివి.

దేశాల్లో ప్రత్యేక శిక్షణ

‘మైసా’ నాకొక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఈ సినిమా కోసం ఇటలీ, థాయ్‌లాండ్‌లలో యాక్షన్‌కి సంబంధించి ప్రత్యేక శిక్షణ తీసుకున్నా. కోపం, బాధ, గుండె పగిలే వేదన, దుఃఖం, పట్టుదల, ధైర్యం, శక్తి... ఇవన్నీ కలిపితేనే ‘మైసా’! షూటింగ్‌లో చాలా గాయాలయ్యాయి. వాటి నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది.

వణుకు పుట్టేది..

ఎన్నో ఎమోషనల్‌ పాత్రలు చేశా. కానీ ‘మైసా’ నాకు పూర్తిగా కొత్త అనుభవం. ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ సినిమా భావోద్వేగంగా ఫీలైతే... ‘మైసా’ కోసం ప్రాణం పెట్టా. కెరీర్‌లో మొదటిసారి షూటింగ్‌కి వెళ్లాలంటేనే వణుకు పుట్టేది. కారణం... అందులోని ప్రమాదకర సన్నివేశాలు. కేరళలోని దట్టమైన అడవుల్లో, కొండ ప్రాంతాల్లో పరిగెత్తడం, జలపాతాల నుంచి దూకడంలాంటివి చేశా. అండర్‌వాటర్‌ సీక్వెన్స్‌ కోసం రోజుకు ఎనిమిది గంటల పాటు నీళ్లలోనే ఉండాల్సి వచ్చేది.

అసౌకర్యంగా అనిపిస్తే..

నాకు ఇబ్బందిగా అనిపించే కొన్ని విషయాలున్నాయి. కమర్షియల్‌ సినిమాలు చేస్తున్నప్పుడు పూర్తిగా సౌకర్యంగా లేని దుస్తులు వేసుకోవాల్సి రావచ్చు. అప్పుడు నేను కొన్ని హద్దులు పెట్టుకుంటా. చాలా సందర్భాల్లో దర్శకులు నేను చెప్పిన దానికి అంగీకరిస్తారనే అనుకుంటా. ధైర్యంగా చర్చించినప్పుడే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందనేది నా నమ్మకం.

ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవడం నాకు చాలా ఇష్టం. పుస్తకం నాకు రిలాక్సేషన్‌ ఇస్తుంది. జపనీస్‌ అనిమే సినిమాలు, సిరీస్‌లు ఇష్టంగా చూస్తా. ఖాళీ సమయాల్లో కె-డ్రామా పుస్తకాలతో రిలాక్స్‌ లు చూస్తూ రిలాక్స్‌ అవుతా. ఒత్తిడి అనిపించినప్పుడు మ్యూజిక్‌ వినడం, డ్యాన్స్‌ చేయడం, లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లడం సరదాగా అనిపిస్తుంది. ఐస్‌క్రీమ్‌ నా స్ట్రెస్‌ బస్టర్స్‌లో ఒకటి.

చాలా సంతోషంగా ఉన్నా..

జీవితంలోని సంతోషాలు, కష్టాలు అన్నీ ఆలోచించుకున్న తర్వాతే.. నేను, విజ్జు (విజయ్‌ దేవరకొండ) కలిసి పెళ్లి నిర్ణయం తీసుకున్నాం. అతను నాకు అన్ని సమయాల్లో అండగా ఉన్నాడు. పెళ్లి తర్వాత.. నా జీవితంలో ఎప్పుడూ లేనంత ఆనందంగా ఉన్నా. అది నా ముఖంలోనే తెలిసిపోతుంది. విజయ్‌ని (Vijay Deverakonda) నేను వెయ్యిసార్లు అయినా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే!

పరీక్ష రాసినట్లే!

చిన్నప్పుడు రోజుకు అరగంట మాత్రమే టీవీ చూసే అవకాశం ఉండేది. అలాంటిది నేను సినిమాల్లోకి వచ్చానంటే.. నాకే నమ్మకం కుదరడం లేదు. ఇప్పటికీ కెమెరా ముందు నిలబడడం అంటే.. ఒక పరీక్ష రాసినట్లుగానే ఉంటుంది. డైలాగులు గుర్తు పెట్టుకోవడం, ఎక్స్‌ప్రెషన్స్‌ ఇవ్వడం, దర్శకుడి ఆలోచనలకు తగ్గట్టుగా నటించడం సవాలుగానే ఉంటుంది.

Updated Date - Nov 22 , 2026 | 10:24 AM