Nag Ashwin: ఇప్పటికే.. ‘సింగ్‌ గీతం’ సినిమాను వంద సార్లు చూశా

ABN , Publish Date - Jun 12 , 2026 | 06:52 AM

‘సింగ్‌ గీతం’ చూసి పదేళ్ల కుర్రాడు కూడా ఇన్‌స్పైర్‌ కావాలన్నదే మా అశ’ అని దర్శకనిర్మాత నాగ్‌ అశ్విన్ అన్నారు.

nag ashwin

‘సింగ్‌ గీతం’ సినిమా ఈతరం ప్రేక్షకులకు మంచి గిఫ్ట్‌ లాంటిది. నేను పదేళ్లున్నప్పుడు ‘ఆదిత్య 369’ చూసి స్ఫూర్తి పొందాను. ‘సింగ్‌ గీతం’ చూసి పదేళ్ల కుర్రాడు కూడా ఇన్‌స్పైర్‌ కావాలన్నదే మా అశ’ అని దర్శకనిర్మాత నాగ్‌ అశ్విన్ (Nag Ashwin) అన్నారు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాలతో బ్లాక్‌బస్టర్‌ విజయాలు సాధించిన ఆయన తాజాగా వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై ‘సింగ్‌ గీతం’ (Sing Geetham)ను నిర్మించారు.

అయాన్‌, శాలిని కొండెపూడి, అహల్య బమ్రూ ప్రధాన పాత్రధారులుగా సీనియర్‌ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasa Rao) తెరకెక్కించిన ‘సింగ్‌ గీతం’ నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు నాగ్‌ అశ్విన్‌.

ఈ సినిమా సింగీతం శ్రీనివాసరావు 40 ఏళ్ల కల. ‘పుష్పక విమానం’ ముందు నుంచే ఈ కథతో సినిమా చేయాలని అనుకునే వారు. కానీ ఆయనకున్న ప్రాజెక్ట్‌ల వల్ల కుదరలేదు. సింగీతంపై ఉన్న ప్రేమ, గౌరవంతో పాటు ఆయన విజన్‌పై ఉన్న నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించాను. ఇది ఆయన స్టైల్లో చేసిన సరికొత్త ప్రయోగం. ఆయన ఓ అద్భుతమైన ఫిల్మ్‌మేకర్‌. ఇప్పటివరకూ ప్రపంచంలోనే ఇలాంటి కథాంశంతో సినిమా రాలేదు అన్నారు.

ఈ చిత్రం కథాంశం కుబేర పురం అనే కల్పిత గ్రామంలో గోల్డ్‌మైన్స్‌ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో స్టార్‌ కాస్టింగ్‌ ఉంటే వారి ఇమేజ్‌ ప్రభావం పడుతుందని కొత్తవారిని తీసుకున్నాము. నేటితరానికీ కనెక్ట్‌ అయ్యేలా ఉంటుందీ సినిమా. ఇప్పటికే ఈ సినిమాను వంద సార్లు చూశాను. ఎక్కడా బోర్‌ కొట్టలేదు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని మరో పదేళ్ల పాటు గుర్తు పెట్టుకుంటారు’ అని చెప్పారు.

Updated Date - Jun 12 , 2026 | 06:52 AM