Nagarjuna: ‘లెనిన్’.. అఖిల్ కోసం చేశా
ABN , Publish Date - Jul 09 , 2026 | 08:01 AM
అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా మురళీ కిశోర్ అబ్బూరు తెరకెక్కించిన చిత్రం లెనిన్ శుక్రవారం ప్రేక్షకుల ఎదుటకు రానుంది.
‘లెనిన్’ (Lenin Movie) కథాంశం శ్రీరామపురంలో జరుగుతుందని తెలియగానే నాన్నగారు గుర్తొచ్చారు. ఈ కథలో ఉండే బాధను అఖిల్ (Akhil) తన జీవితంలోనూ ఎదుర్కొన్నాడు. అందుకే ఈ స్టోరీకి, అఖిల్‌కు బాగా సింక్ కుదిరింది. ఇదొక గొప్ప సినిమా అవుతుందని ముందు నుంచే నమ్మకం ఉంది. ‘మనం’ తర్వాత నేను నిర్మాతగా బాగా ఇన్‌వాల్వ్ అయిన చిత్రమిదే. ‘మనం’ నాన్నగారి కోసం చేస్తే.. ‘లెనిన్’ అఖిల్ కోసం చేశా. చాలా ప్రేమతో, ఇష్టంతో చేసిన సినిమా ఇది. ప్రేక్షకులు కూడా మా ప్రేమను తిరిగిస్తారనే నమ్మకం ఉంది’ అని హీరో అక్కినేని నాగార్జున (Nagarjuna) అన్నారు.
అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా మురళీ కిశోర్ అబ్బూరు (Murali Kishor Abburu) తెరకెక్కించిన చిత్రం ‘లెనిన్’. నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ శుక్రవారం ‘లెనిన్’ విడుదలవుతున్న సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో అఖిల్ మాట్లాడుతూ ‘లెనిన్’ మన మూలాలకు చాలా దగ్గరగా ఉంటుంది. హింసతో పాటు హృదయాన్ని బరువెక్కించే భావోద్వేగాలున్న చిత్రమిది’ అని చెప్పారు. నాగవంశీ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో అఖిల్ చాలా కొత్తగా కనిపిస్తారు’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు థమన్, చిత్రం దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) పాల్గొన్నారు.