Rajkumar Kasireddy: మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని వచ్చి.. నటుడినయ్యా!
ABN , Publish Date - Aug 21 , 2026 | 02:25 PM
సంగీత దర్శకుడిని అవుదామని వెళ్లి అనుకోకుండా యాక్టర్ అయ్యానని వర్ధమాన సినీ నటుడు కసిరెడ్డి రాజ్ కుమార్ చెప్పారు.
సంగీత దర్శకుడిని అవుదామని చిత్రపరిశ్రమకు వెళ్లి అనుకోకుండా యాక్టర్ అయ్యానని వర్ధమాన సినీ నటుడు కసిరెడ్డి రాజ్ కుమార్ (Rajkumar Kasireddy) చెప్పారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో ఒక వివాహ వేడుకకు గురువారం హాజరై కాసేపు సరదాగా ముచ్చటించారు. మాది ఏలేశ్వరం మండలం భద్రవరం.. తాతయ్య యాళ్ల మాణిక్యం (తిక్క రాజు) ప్రోత్సాహంతో మ్యూజిక్‌లో డిప్లమో చేశా. మ్యూజిక్ డైరెక్టర్ కావాలనే కోరికతో 2017లో చిత్ర సినిమాలో అడుగు పెట్టా.. ఊహించని విధంగా నటుడిగా అవకాశాలు వచ్చాయి. ఇప్పటి వరకు 13 చిత్రాల్లో నటించగా.. అన్నీ గుర్తింపు పొందిన పాత్రలే లభించాయి. ముఖ్యంగా రాజావారు రాణి గారు, లక్కీ భాస్కర్, చౌదరి కామెడీ, హోమ్, బెదుర్లంక, రంగరంగ వైభవంగా తదితర చిత్రాలు మంచి గుర్తింపునిచ్చాయి.
ఇప్పటి వరకు హీరోకు స్నేహితుడిగా, దగ్గర బంధువు పాత్రల్లో నటించానని, తాజాగా ఇరుముడి సినిమాలో హీరో రవితేజ స్నేహితుడిగా నటించానని ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరుముడి సినిమాలో తండ్రి కుమార్తెల మధ్య ఉండే బాండింగ్ అత్యద్భుతంగా తీశారని, కచ్చితంగా అవార్డులు వస్తాయన్నారు. ఇంకా ముమ్ముట్టి తనయుడు దుల్కర్ హీరోగా ఆకాశంలో ఒక తార సినిమా, విజయ్ దేవరకొండ హీరోగా రౌడీ జనార్దన్ సినిమాలోను హీరో స్నేహితుడి పాత్రల్లో నటిస్తున్నా అన్నారు.
అంతేగాక. ఎంపి, డాన్ బాస్కో వంటి మరో నాలుగు చిత్రాల్లో కూడా నటిస్తున్నట్లు తెలిపారు. స్నేహితులు, డైరెక్టర్ కోలా రవి కిరణ్ తదితరుల ప్రోత్సాహంతోనే సినిమాల్లోకి వచ్చా అని.. నాకు మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్. మంచి నటుడుగా మరింత గుర్తింపు పొందాలని ఉందన్నారు. భద్రవరంతో పాటు ప్రత్తిపాడు నియోజకవర్గంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆలోచన కూడా ఉందని.. నా జన్మభూమికి ఎంతో కొంత సేవ చేయాలి కదా మరి అంటూ ముగించారు.