సూర్య సీన్ తెలుగు ట్రైలర్.. మ్యాటర్ మాములుగా లేదుగా
ABN , Publish Date - Nov 01 , 2026 | 01:57 PM
అడాప్టడ్ సన్ ఆఫ్ టాలీవుడ్ సూర్య (Suriya) హీరోగా ఈ యేడు ప్రజల ముందుకు వస్తున్న మూడవ చిత్రం సీన్.
టాలీవుడ్ అడాప్టడ్ సన్ ఆఫ్ టాలీవుడ్ సూర్య (Suriya) హీరోగా ఈ యేడు ప్రజల ముందుకు వస్తున్న మూడవ చిత్రం సీన్ (Scene). ప్రముఖ మలయాళ దర్శకుడు రోమాంచం, ఆవేశం వంటి బ్లాక్ బస్టర్ సినిమాల అనంతరం జీతూ మాధవన్ (Jithu Madhavan) దర్శకత్వం వహించాడు. నజరీయా నజీమ్ (Nazriya Nazim) కథానాయికగా, మలయళ వర్ధమాన హీరో (ప్రేమలు ఫేం) నస్లేన్ (Naslen) ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ చిత్రం నవంబర్ 6న ప్రేక్షకుల ఎదుటకు వస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు హోరెత్తిస్తుండగా ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్ మంచి ఆదరణ దక్కించుకున్నాయి. ఈ క్రమంలో సినిమా రిలీజ్‌కు మరో మూడు రోజుల సమయం ఉండడంతో తాజాగా శనివారం రాత్రి చెన్నైలో ప్రత్యేక ఈ వెంట్ నిర్వహించి ఈ చిత్రం అఫీసియల్ ట్రైలర్ విడుదల చేశారు.
చాలా రోజుల తర్వాత సూర్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో డీఎస్పీ ప్రేమ్ రాజ్‌గా కనిపించనున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తే మ్యాటర్ గట్టిగానే ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ట్రైలర్ కట్ మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంది. తను చేసే డ్యూటీకి గుడ్ బై చెప్పాలనుకున్న డీఎస్పీ ప్రేమ్ రాజ్‌ను తిరిగి డ్యూటీలో చేరాలని కోరడం అందుకు ఆయన ససేమిరా అనడం ఆపై ఇతర పోలీసులు అతనిని బలవంతంగా స్టేషన్‌కు తీసుకెళ్లి డ్యూటీలో జాయిన్ చేయించడం ఆసక్తికరంగా ఉంది. అంతేగాక సినిమాలోని అన్ని ప్రధాన పాత్రలను ఇంట్రెస్టింగ్గా పరిచయం చేశారు.
పైగా తెలుగు డబ్బింగ్ కూడా ఇప్పటి వరకు వచ్చిన సూర్య అన్ని చిత్రాలకు భిన్నంగా అచ్చం తెలుగు సినిమానే చూస్తున్నామా అనేలా ఉండడం విశేషం. పైగా ప్రధానమైన మూడు పాత్రలకు వారే స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే సీరియల్ మర్డర్స్.. ఆ కిల్లర్‌ను పట్టుకునేందుకు హీరో చేసే ప్రయత్నాలతో కామెడీ, యాక్షన్‌ను సరైన మోతాదులో మిక్స్ చేసి సినిమాను తీర్చిదిద్దినట్టు స్పష్టంగా తెలియ వస్తుంది. ఇప్పటికే ఈ ఏడాది సూర్య నుంచి వచ్చిన వీరబధ్రుడు, విశ్వనాధన్ అండ్ సన్స్ బ్లాక్ బస్టర్స్ అవగా ఇప్పుడు సీన్ కడా హిట్ అయితే సూర్య ఖాతాలో హ్యట్రిక్ విజయాలు చేరి కొత్త రికార్డు నమోదు చేసినట్లు అవుతుంది.