ఇది కదా కావాల్సింది.. డార్లింగ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్
ABN , Publish Date - May 10 , 2026 | 09:10 PM
ప్రస్తుతం సోషల్ మీడియాలో 'కల్కి 2' విడుదల తేదీకి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) రూపొందించిన విజువల్ వండర్ 'కల్కి 2898 AD' (Kalki 2) బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. 2024 జూన్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండియన్ సినిమా సత్తాను చాటిన ఈ చిత్రానికి ఇప్పుడు రెండో భాగం సిద్ధమవుతోంది. మొదటి భాగం ముగిసిన తీరు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచడమే కాకుండా, రాబోయే సీక్వెల్‌లో కథ ఏ మలుపు తిరుగుతుందనే ఆసక్తిని అందరిలోనూ రేకెత్తించింది. దీంతో కల్కి-2 కోసం సినీ ప్రేక్షకులతో పాటు డార్లింగ్ ప్రభాస్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో 'కల్కి 2' విడుదల తేదీకి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 2027 నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సీరియస్‌గా ప్లాన్ చేస్తోందట. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, అంతర్గతంగా ఈ గడువుపైనే చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నాణ్యతతో కూడిన అవుట్‌పుట్‌ను నిర్ణీత సమయంలోగా అందించాలని మేకర్స్ కృతనిశ్చయంతో ఉన్నారట.
సాధారణంగా భారీ విజువల్ ఎఫెక్ట్స్ (VFX) గ్రాఫిక్స్ ఉండే సినిమాలకు ఏళ్ల తరబడి సమయం పడుతుంది. అయితే 'కల్కి 2' విషయంలో నాగ్ అశ్విన్ ముందే జాగ్రత్త పడ్డారు. పార్ట్ 1 షూటింగ్ జరుగుతున్నప్పుడే పార్ట్ 2కి సంబంధించిన చాలా వరకు ప్రీ-ప్రొడక్షన్ పనులు, అలాగే కొంత భాగం షూటింగ్‌ను కూడా పూర్తి చేసి ఉంచారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేవలం కీలక సన్నివేశాల బ్యాలెన్స్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని, అది పూర్తయితే సినిమా వేగంగా పట్టాలెక్కుతుందని సమాచారం.
ఈ సీక్వెల్‌లో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటుల మధ్య కీలకమైన పోరాటాలు, సన్నివేశాలు ఉండబోతున్నాయి. వీరితో పాటు సాయి పల్లవి కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతటి భారీ స్టార్ కాస్ట్‌కు సంబంధించిన డేట్స్‌ను ఒకేసారి అడ్జస్ట్ చేయడమే ప్రస్తుతం మేకర్స్ ముందున్న అతిపెద్ద సవాలు. ఈ ప్రక్రియ సజావుగా సాగితే, సినిమా అనుకున్న సమయానికి విడుదల కావడం పెద్ద కష్టమేమీ కాదు.
ప్రస్తుతం ప్రభాస్ తన విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. ఆ ప్రాజెక్ట్ ఒక కొలిక్కి వచ్చిన తర్వాతే ఆయన తిరిగి 'కల్కి 2' సెట్స్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. మరోవైపు, సీక్వెల్‌లో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని టీమ్ భావిస్తోంది. సీజీఐ, వీఎఫ్ఎక్స్ పనుల కోసం ఎక్కువ సమయం కేటాయించి, 2027 చివరి నాటికి మరో విజువల్ మాస్టర్‌పీస్‌ను ప్రేక్షకులకు అందించాలని చిత్రబృందం భావిస్తోంది. అయితే, ఈ విజువల్ వండర్ అనుకున్న సమయానికి వస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.