చిరంజీవి ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. పుట్టినరోజునే అప్‌డేట్

ABN , Publish Date - Aug 02 , 2026 | 09:11 AM

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 22న అభిమానులకు మెగా ట్రీట్స్ ఇస్తారని వార్తలు వైరల్ అవుతున్నాయి. 

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 22న అభిమానులకు మెగా ట్రీట్స్ ఇస్తారని వార్తలు వైరల్ అవుతున్నాయి.  ఇప్పటికే దర్శకుడు బాబీ (Bobby kolli) తెరకెక్కిస్తున్న కొత్త సినిమా టైటిల్ టీజర్‌ను అదే రోజున విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. చిరంజీవి నటిస్తున్న మరో చిత్రమైన ‘విశ్వంభర’ నుంచి కూడా ప్రత్యేక అప్‌డేట్ ఆ రోజే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కుతోంది. వీఎఫ్‌ఎక్స్ పనులు ఆశించిన దానికంటే ఎక్కువ సమయం తీసుకోవడంతో ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడింది.

అయితే ప్రస్తుతం నిర్మాణానంతర పనులు తుది దశకు చేరుకున్నట్లు తెలిసింది. దసరా కానుకగా అక్టోబర్ 16న ‘విశ్వంభర’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తూ కొత్త గ్లింప్స్‌ను చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా, ఛోటా కె. నాయుడు ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు. ఇప్పటికే ‘విశ్వంభర’పై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఆగస్టు 22న వచ్చే ప్రకటన కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Updated Date - Aug 02 , 2026 | 10:08 AM