సుహాస్ ఇమేజ్‌ను.. మార్చే సినిమా ‘హే భగవాన్’
ABN , Publish Date - Feb 12 , 2026 | 09:23 AM
యంగ్ హీరో సుహాస్, శివానీ నగరం జంటగా నటించిన తాజా చిత్రం ‘హే భగవాన్’.
యంగ్ హీరో సుహాస్, శివానీ నగరం జంటగా నటించిన తాజా చిత్రం ‘హే భగవాన్’. బన్నీ వాస్, వంశీ నందిపాటి సమర్పణలో బి. నరేంద్ర రెడ్డి నిర్మించారు. ఈనెల 20న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు గోపీ అచ్చర మీడియాతో మాట్లాడారు.
‘సుహాస్ నాకు బాల్య మిత్రుడు. నటుడిగా సుహాస్ బలం కామెడీనే అయినా, ఈ సినిమాలో తన పాత్ర ప్రేక్షకుల అంచనాలను తలకిందులు చేసేలా ఉంటుంది. ఇంతవరకూ తను చేసిన పాత్రలకు భిన్నంగా, ఆద్యంతం నవ్విస్తూనే, సరికొత్త మేకోవర్‌లో కనిపిస్తాడు. సుహాస్ ఇమేజ్‌ను మార్చే చిత్రమిది. మన నిత్య జీవితంలో ఎదురయ్యే ఇబ్బందికర పరిస్థితుల్లో వచ్చే ‘హే భగవాన్’ అనే పలుకును ఈ సినిమాకు టైటిల్‌గా పెట్టాం.
సినిమాలో పాత్రలకు కూడా అలాంటి ఘటనలే ఎదురవుతాయి. ఆరంభం నుంచి పతాక సన్నివేశాల వరకూ ఆద్యంతం నవ్వులు పంచుతూనే, చివరలో తండ్రీ కొడుకుల మధ్య ఉండే ఎమోషన్‌తో గుండెల్ని బరువెక్కిస్తాం. నిర్మాత సహకారంతో 36 రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేశాం. కుటుంబం అంతా కలసి చూసేలా మా సినిమా ఉంటుంది’ అని గోపీ చెప్పారు.