అప్పుడు.. హీరోయిన్ ముందే అవమానించారు! కట్ చేస్తే ఇప్పుడు కీర్తి సురేశ్‌తోనే సినిమా చేశా
ABN , Publish Date - Feb 18 , 2026 | 01:27 PM
ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతున్న నిర్మాతల ద్వయం బన్నీ వాస్, వంశీ నందిపాటి నుంచి మరో వినోదాత్మక చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతున్న నిర్మాతల ద్వయం బన్నీ వాస్, వంశీ నందిపాటి నుంచి మరో వినోదాత్మక చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లపై రూపొందిన ‘హే బల్‌వంత్’ (Hey Balwanth) చిత్రం ఫిబ్రవరి 20న విడుదలకు సిద్ధమైంది. ముందుగా ‘హే భగవాన్’గా ఉన్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సూచన మేరకు టైటిల్ మార్చారు. గోపీ అచ్చర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సుహాస్ (Suhas), శివానీ నాగారం (Shivani) ప్రధాన పాత్రల్లో నటించగా, సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి కీలక పాత్రలు పోషించారు. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి. నరేంద్ర రెడ్డి నిర్మించారు. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో సందీప్ కిషన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ.. సుహాస్ కథను నమ్మి సినిమాలు చేసే నటుడని, అతని నిజాయితీ తనకు చాలా ఇష్టమని సందీప్ కిషన్ అన్నారు. టైటిల్ మార్పుతో సినిమా మీద ఆసక్తి మరింత పెరిగిందని, టీజర్ ఆకట్టుకుందని తెలిపారు. మంచి ప్రమోషన్‌తో ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేశారని, సినిమా తప్పకుండా విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేశారు. శివానీ నాగారం మాట్లాడుతూ.. టైటిల్ మార్పు సమయంలో కొంత టెన్షన్ ఉన్నా, ఇప్పుడు సినిమా మీద పూర్తి నమ్మకం ఉందని శివానీ అన్నారు. వినోదం, భావోద్వేగం కలగలిపిన పూర్తి ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరిస్తుందని తెలిపారు. సుహాస్‌తో పని చేయడం ప్రత్యేక అనుభవమని చెప్పారు.
డేట్‌లు మారినా, టైటిల్ మారినా సినిమా ఇంపాక్ట్ మాత్రం మారదని వంశీ నందిపాటి ధీమా వ్యక్తం చేశారు. ఫాదర్-సన్ భావోద్వేగం ప్రధానంగా సాగే ఈ చిత్రం ప్రేక్షకులను హత్తుకుంటుందని చెప్పారు. దర్శకుడు గోపీపై ఉన్న నమ్మకంతోనే రెండో సినిమాకు అడ్వాన్స్ ప్రకటించినట్లు వంశీ నందిపాటి తెలిపారు. నిర్మాత నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ.. అనేక కథలు విన్న తరువాత గోపీ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ప్రాజెక్ట్ ప్రారంభించామని చెప్పారు. బృందం సమిష్టి కృషితో సినిమా పూర్తి చేసామని వెల్లడించారు. దర్శకుడు గోపీ అచ్చర మాట్లాడుతూ.. టైటిల్ మాత్రమే మారిందని, కంటెంట్‌లో మార్పు లేదని స్పష్టం చేశారు. సుహాస్ అందించిన సహకారం అదించారని, నిర్మాత పాషన్ ఈ చిత్రానికి బలం అయిందని పేర్కొన్నారు. సినిమా విజయంపై పూర్తి నమ్మకం ఉందన్నారు.
కథానాయకుడు సుహాస్ మాట్లాడుతూ '' నన్ను ఎప్పుడూ ఎంకరైజ్ చేసే హీరో సందీప్‌కిషన్‌కు నా కృతజ్క్షతలు. టీమ్ అంతా ఎంతో కష్టపడి ఈ సినిమా చేశారు. నిర్మాత ఎక్కడా రాజీ పడ లేదు.. షూటింగ్ అంతా ఎంతో పాజిటివ్‌గా జరిగింది. వంశీ నందిపాటి గురించి ఇంతకు ముందు విన్నాను. ఈసినిమాతో ఆయనెంటో తెలిసింది. ఆయన మంచి ప్లానింగ్‌తో సినిమా మీద బజ్ తీసుకొచ్చాడు. దర్శకుడు గోపీ ఈ సినిమాతో ఆయన డ్రీమ్ నెరవేర్చుకున్నాడు. శివానీ, సుదర్శన్‌లు ఇద్దరూ సూపర్‌గా యాక్ట్ చేశారు. నా కెరీర్‌లో మజిలీ సినిమాతో బ్రేక్ వచ్చింది. మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఆ సమయంలోనే పెద్ద హీరోయిన్‌తో ఓ సినిమాలో ఆఫర్ వచ్చింది. సినిమాలో హీరోయిన్‌తో క్లోజ్‌గా ఉండే పాత్ర అది. నా ముందే ఒకాయన సెట్‌లో ఇతనిని ఎందుకు పిలిచారు? అన్నారని కానీ కట్ చేస్తే ఇటీవల కీర్తిసురేష్‌తో కలిసి ఉప్పు కప్పురంబు అనే సినిమా చేశానని, నేను గ్రేట్‌గా ఫీలయిన మూమెంట్ అది. ఎవరైనా మిమ్మలను తక్కువ చేసి మాట్లాడితే మీరు నవ్వి ఊరుకోండి.. ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. ఇక 'హే బల్‌వంత్'తో నాకు పెద్ద హిట్ వస్తుందని నమ్ముతున్నాను' అన్నారు.