సాదాసీదాగా అమోఘ హోటల్‌కు.. హీరో విజయ్ ఆంటోని! ఫ్యాన్స్ ఫిదా!

ABN , Publish Date - Nov 24 , 2026 | 10:20 AM

అమీర్ పేటలోని అమోఘ హోటల్‌కు సినీ హీరో విజయ్ ఆంటోని సాదాసీదాగా వచ్చి సందడి చేశారు.

Vijay Antony

సినీ తారలు బయట కనిపిస్తే అభిమానుల సందడి ఎలా ఉంటుందో మరోసారి రుజువైంది. ప్రముఖ తమిళ నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని (Vijay Antony) హైదరాబాద్ (Hyderabad) లోని ఓ హోటల్‌ను సందర్శించి సందడి చేశారు. ఎలాంటి హడావుడి లేకుండా చాలా సాధారణంగా హోటల్‌కు వచ్చిన ఆయన.. అక్కడి ప్రత్యేక రుచులను ఆస్వాదించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం స్థానికంగా ఆసక్తిని కలిగిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే.. విజయ్ ఆంటోని, ప్రీతీ అశ్రాని (Preethi Asrani) జంట‌గా న‌టించిన నూత‌న చిత్రం అప్పా కుట్టి (Appakutti). గ‌త వారం త‌మిళ‌నాట విడుద‌లై విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోంది. కాగా ఈ చిత్రాన్ని నాన్న కుట్టి (Nana Kutti) పేరుతో ఈ శుక్ర‌వారం న‌వంబ‌ర్ 27న తెలుగు రాష్ట్రాల‌లో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ చేప‌ట్టిన చిత్ర బృందం విజ‌య్ అంటోనీ, ప్రీతి అశ్రాని ఇత‌ర న‌టీన‌టులు హైద‌రాబాద్‌లోని జ‌న సందోహం ఉన్న ప్రాంతాల‌లో తిరుగుతూ త‌మ సినిమాను జ‌నాల్లోకి తీసుకెళుతున్నారు.

ఈ క్ర‌మంలోనే మంగ‌ళ‌వారం మెట్రోలో ప్ర‌యాణించి ప్ర‌యాణికుల‌తో ముచ్చ‌టించారు. ఆపై అమీర్‌పేటలో ఉన్న అమోఘ హోటల్ (Amogha Hotel) కు వెళ్లారు. అక్కడ చాయ్, బన్, మస్కా రుచులను ఆస్వాదించారు. సాధారణ వ్యక్తిలా హోటల్‌కు వచ్చిన ఆయనను చూసిన అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. తమ అభిమాన హీరోను దగ్గరగా చూసే అవకాశం రావడంతో సినీ ల‌వ‌ర్స్ చాలామంది సెల్ఫీలు దిగేందుకు పోటీ ప‌డ్డారు. ఈ సందర్భంగా విజయ్ ఆంటోని కూడా అభిమానులను ఎంతో ఆప్యాయంగా పలకరించారు. దీంతో హోటల్ పరిసరాల్లో సందడి నెలకొంది. విషయం తెలుసుకున్న స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో రద్దీ మరింత పెరిగింది.

మరోవైపు అభిమానులు, స్థానికులు భారీగా తరలిరావడంతో అమీర్‌పేటలోని సత్యం టాకీస్ చౌరస్తా వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సాధారణంగా స్టార్ హోటళ్లలో కనిపించే సినీ తారలు.. ఎలాంటి ఆర్భాటం లేకుండా స్థానిక హోటల్‌కు రావడం అక్కడివారికి కొత్త‌ అనుభూతిని కలిగించింది. అంత స్టార్‌డమ్ ఉన్నప్పటికీ విజయ్ ఆంటోని తన సింప్లిసిటీతో సాధారణంగా కనిపిస్తూ అభిమానులతో కలిసిపోయిన ఆయన తీరుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Updated Date - Nov 24 , 2026 | 10:51 AM