రాజశేఖర్ జోరు.. బ్యాక్ టు బ్యాక్ మూవీస్
ABN , Publish Date - Mar 23 , 2026 | 10:19 PM
యాంగ్రీ మేన్ ఇమేజ్ తో తెలుగువారిని అలరించిన డాక్టర్ రాజశేఖర్ ఇప్పుడు కేరెక్టర్ యాక్టర్ గా మారారు. రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో రాజశేఖర్ కీ రోల్స్ లో కనిపించనున్నారు. ఇకపై తనకు నచ్చిన పాత్రలు వస్తే కేరెక్టర్ రోల్స్ చేస్తానంటున్నారు రాజశేఖర్.
ఒకప్పుడు 'యాంగ్రీ యంగ్ మేన్'గా తెలుగు సినిమా రంగంలో విజయపథంలో పయనించారు డాక్టర్ రాజశేఖర్ (Dr Rajasekhar). తరువాత కూడా 'యాంగ్రీ మేన్' గానే పలు విజయాలను దక్కించుకున్నారు. ఆయన తరం హీరోల్లో చాలామంది కేరెక్టర్ రోల్స్ లోకి మారినా, రాజశేఖర్ మాత్రం అడపా దడపా హీరోగా నటిస్తూనే వచ్చారు. 'గరుడవేగ' సినిమాతో అలరించిన రాజశేఖర్ ఆ తరువాత ఏ మాత్రం హీరోగా సందడి చేయలేక పోయారు.
ఈ నేపథ్యంలో ఎంతోమంది శ్రేయోభిలాషులు ఆయనను కేరెక్టర్ రోల్స్ లో నటించమని సలహా ఇచ్చారు. మొత్తానికి రాజశేఖర్ సైతం మనసు మార్చుకొని శర్వానంద్ హీరోగా రూపొందిన 'బైకర్' మూవీలో కేరెక్టర్ రోల్ లో నటించారు. ఏప్రిల్ 3న ఈ చిత్రం విడుదల కానుంది. ఇకపై తాను వరుసగా కేరెక్టర్ రోల్స్ లో నటిస్తాననీ రాజశేఖర్ అంటున్నారు. మంచి పాత్రలు ఇచ్చి తనను సినిమాల్లో పెట్టుకోమని రాజశేఖర్ తనదైన శైలిలో చెప్పడం ఆకట్టుకుంటోంది.
ఈ నాటికీ టాప్ స్టార్స్ గా సాగుతోన్న చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ తరువాతి స్థానం తనదే అంటూ అప్పట్లో రాజశేఖర్ సక్సెస్ రూటులో సాగారు. ఆయన నటించిన "అంకుశం, అల్లరి ప్రియుడు, అన్న" వంటి చిత్రాలు బంపర్ హిట్స్ గా నిలిచాయి. తరువాతి రోజుల్లోనూ రాజశేఖర్ హీరోగా రూపొందిన "శివయ్య, మా అన్నయ్య" వంటి సినిమాలు విశేషాదరణ చూరగొన్నాయి. కొంతకాలంగా రాజశేఖర్ నటించిన ఏ చిత్రమూ ప్రేక్షకులను రంజింప చేయలేకపోయింది.
అప్పట్లో రాజశేఖర్ కు పోటీదారుగా భావించిన యాక్షన్ హీరో సుమన్ ఏ నాడో కేరెక్టర్ రోల్స్ లోకి టర్న్ అయ్యారు. కేరెక్టర్ యాక్టర్ గా సుమన్ సక్సెస్ చూశారు. అందువల్ల కొందరు సన్నిహితులు రాజశేఖర్ ను కూడా కేరెక్టర్ రోల్స్ చేయమని సలహా ఇచ్చారు. ఇన్నాళ్ళకు తనకు నచ్చిన పాత్ర రావడంతో శర్వానంద్ 'బైకర్'లో హీరో తండ్రి పాత్రలో నటించారు రాజశేఖర్.
బైకర్ (Biker) చిత్రంతో పాటు విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతోన్న రౌడీ జనార్దన్ (Rowdy Janardhana) లోనూ రాజశేఖర్ కీలక పాత్ర ధరిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న దిల్ రాజు రాబోయే 'బైకర్' మూవీని పంపిణీ చేస్తూండడం విశేషం!. శర్వానంద్ తో ఇంతకు ముందు 'రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా' వంటి సక్సెస్ మూవీస్ నిర్మించిన 'యు.వి. క్రియేషన్స్' సంస్థ 'బైకర్' ను నిర్మించింది. అందువల్ల ఈ సినిమాపై హోప్స్ బాగానే ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ అయితే ఇందులో కీలక పాత్ర ధరించిన రాజశేఖర్ కూడా కేరెక్టర్ యాక్టర్‌గా బిజీ అవుతారని అంటున్నారు పరిశీలకులు. మరి ఏప్రిల్ 3న రానున్న 'బైకర్' ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.