Vishwanath & Sons: తమిళనాట ఎదురుగాలి.. నెత్తిన పెట్టుకున్న టాలీవుడ్
ABN , Publish Date - Aug 21 , 2026 | 06:23 PM
తమిళ స్టార్ హీరో సూర్య అభిమానులకు ఆనందం- ఆవేదన ఒకేసారి దరి చేరాయి. ఎందుకంటే..?
తమిళ స్టార్ హీరో సూర్య అభిమానులకు ఆనందం- ఆవేదన ఒకేసారి దరి చేరాయి. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ తరువాత సూర్య సినిమా ఓ రికార్డ్ సాధించింది. అదే సమయంలో మరో సినిమా ఫ్యాన్స్ నీరుకారి పోయేలా చేసింది. ఎందుకో చూద్దాం?
మొన్నటి దాకా విజయ్ సినిమా ఎలా ఉన్నా ఇట్టే రెండు వందల కోట్ల రూపాయలు వసూలు చేసేది. అలాంటిది విజయ్ (Vijay) తాజా చిత్రం జననాయగన్ (Jana Nayagan) ఆ ఫీట్ సాధించలేక పోయింది. అందునా విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తరువాత వచ్చిన 'జననాయగన్' బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయకపోవడం గమనార్హం. ఈ క్రమంలో 'జననాయగన్' కంటే ముందు విడుదలైన సూర్య (Suriya) కరుప్పు (Karuppu) విజయ్ సినిమా కంటే ఎక్కువ వసూలు చేయడం విశేషంగా మారింది. సూర్య 'కరుప్పు' సినిమా మే 15వ తేదీన విడుదలయింది. ఈ చిత్రం విడుదలైన రెండు నెలల తరువాత జూలై 23న 'జననాయగన్' జనం ముందు నిలచింది.
తమిళనాడులో 'కరుప్పు' ఫినిషింగ్ బాక్సాఫీస్ నంబర్ 170 కోట్లు దాటింది. 'జననాయగన్' నెలలోపే ఇక ముందుకు సాగే పరిస్థితి లేదని తేలింది. ఈ సినిమా చివరకు తమిళనాట 160 కోట్ల వద్ద ఆగిపోయింది. చిత్రమేంటంటే ఈ మధ్యే విడుదలైన సూర్య సినిమా 'విశ్వనాథ్ అండ్ సన్స్స (Vishwanath & Sons) మాత్రం తమిళనాడులో ముందు సినిమా 'కరుప్పు'లా హల్ చల్ చేయలేకపోతోంది. ఈ మూవీ ఆరు రోజులకు 38 కోట్లు మాత్రమే పోగేసింది. అంటే తమిళనాడులో 'విశ్వనాథ్ అండ్ సన్స్'కు ఎదురుగాలి వీస్తోందన్న మాట. అదే ఇప్పుడు సూర్య అభిమానులకు ఆవేదన కలిగిస్తోన్న అంశం.
చిందులేస్తోన్న సూర్య ఫ్యాన్స్...
సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం తెలుగునాట విశేషాదరణ చూరగొంది. ఒక్క నైజామ్ ఏరియాలోనే ఈ సినిమా ఇప్పటికే 20 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే తమిళనాట మాత్రం ఈ హవా చూపించకున్నా సూర్య ఫ్యాన్స్ కి మహదానందం పంచుతున్న అంశమేంటంటే - విజయ్ సినిమా కంటే రెండు నెలలు ముందు వచ్చిన 'కరుప్పు' ఈ యేడాది టాప్ గ్రాసర్స్ లో నంబర్ వన్ ప్లేస్ లో నిలవడం. అదీగాక చాలా ఏళ్ళ తరువాత విజయ్ సినిమాను సూర్య మూవీ క్రాస్ చేయడంతో ఫ్యాన్స్ చిందులేస్తున్నారు. 'విశ్వనాథ్ అండ్ సన్స్' తమిళనాట సత్తా చాటలేకపోయినా, తెలుగులో ఘనవిజయం సాధించడంపై చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి జోష్ లో ఉన్నారు.
నెక్ట్స్ కోలీవుడ్ సూపర్ స్టార్..?
విజయ్, సూర్య ఇద్దరూ కలసి చదువుకున్నారు. ఒకే సమయంలో చిత్రసీమలో అడుగు పెట్టారు. ఇద్దరూ కలసి నటించి అలరించారు. అయితే అనూహ్యంగా విజయ్ టాప్ స్టార్ అయ్యారు. సూర్య మాత్రం స్టార్ హీరోగా తమిళ, తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ సాగుతున్నారు. విజయ్ రాజకీయాల్లోకి వెళ్తున్న సమయంలోనే 'నెక్ట్స్ సూపర్ స్టార్ ఎవరు' అంటూ తమిళనాట ఓ చర్చ సాగింది. ఆ సమయంలో అత్యధికులు అజిత్ పేరు చెప్పారు. ఆ పరిశీలనలో అజిత్ తరువాతి స్థానంలో సూర్య నిలిచారు.
అయితే విజయ్ ముఖ్యమంత్రి కాగానే 'నెక్ట్స్ సూపర్ స్టార్ సూర్య' అంటూ ప్రచారం హోరెత్తుకుంది. ఈ క్రమంలోనే సూర్య సినిమాలకు కూడా క్రేజ్ పెరిగింది. అందుకు నిదర్శనంగానే ఇప్పుడు తమిళనాట టాప్ గ్రాసర్ గా 'కరుప్పు' నిలచిందని కోలీవుడ్ ట్రేడ్ సర్కిల్స్ అంటున్నాయి. ఇక 'విశ్వనాథ్ అండ్ సన్స్' తమిళనాట అనుకున్న స్థాయి విజయాన్ని సాధించకున్నా రాబోయే చిత్రాలతో సూర్య అలరిస్తారేమో చూద్దాం.