హరీశ్ శంకర్: రీమేక్ చేయాలనిపిస్తే.. చెప్పి చేస్తాను..
ABN , Publish Date - Mar 02 , 2026 | 08:01 PM
గబ్బరసింగ్‌లో పవన్‌కల్యాణ్ ఎక్కువశాతం పోలీస్ గెటప్‌లోనే కనిపిస్తారు. ఈసారి దానికి భిన్నంగా చూపించాలనే ప్రయత్నంలో కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో కథ అనుకున్నాం. దానికి ’భవదీయుడు భగత్‌సింగ్’ అనుకున్నాం.
‘నాకు నచ్చిన సినిమాని రీమేక్ చేయాల్సి వస్తే.. దాని గురించి ముందుగానే చెబుతా. ‘గబ్బర్‌సింగ్’ రీమేక్ కాబట్టే.. టైటిల్ కార్డులో ‘మాటలు, మార్పులు దర్శకత్వం’ అని పెట్టా. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ రీమేక్ కాదు’ అని హరీశ్ శంకర్ అన్నారు. ఆయన దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రమోషన్స్ షురూ చేశారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
పేరే అర్థం కాకపోతే ఎలా?
గబ్బరసింగ్‌లో పవన్‌కల్యాణ్ ఎక్కువశాతం పోలీస్ గెటప్‌లోనే కనిపిస్తారు. ఈసారి దానికి భిన్నంగా చూపించాలనే ప్రయత్నంలో కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో కథ అనుకున్నాం. దానికి ’భవదీయుడు భగత్‌సింగ్’ అనుకున్నాం. అది హీరోగారికి బాగా నచ్చింది. టైటిల్ లీక్ అయిపోయింది. సోషల్ మీడియాలో మాత్రం భవదీయుడు అంటే అర్థం ఏంటని జెన్‌జీల నుంచి వరుస ప్రశ్నలు. సినిమా పేరే అర్థం కాకపోతే ఎలా? అని ఆలోచనలో పడ్డా. పైగా మాస్ అంశాలు కాలేజ్ కథలో సెట్ కాలేదు. యూనివర్స్ ట్రెండ్ ఉంది కదా.. అని ‘గబ్బర్‌సింగ్ క్యారెక్టర్ నుంచి మరో పవర్‌ఫుల్ పోలీస్ పాత్రతో కథ తయారు చేశాం. సినిమా మొదలవ్వగానే ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ పేరు ఎందుకు పెట్టామనేది అర్థమవతుంది.
ఈలలు, చప్పట్లతో మార్మోగిపోయింది..
ఈ సినిమాలో కల్యాణ్‌గారి డాన్స్ మూమెంట్స్ అభిమానులకు నచ్చేలా ఉంటాయి. 350 మందితో కలిసి ఓ పాటకు డాన్స్ చేశారు. చప్పట్లు, ఈలలతో సెట్‌లో సందడే సందడి. నేను ఆయన దగ్గరకు వెళ్లి వన్స్‌మోర్ సర్ అని అడిగాను. ‘ఇంతమందికి నచ్చింది కదా.. వన్స్‌మోర్ ఎందుకు?’ అని పవన్ అన్నారు. మీరు డ్యాన్స్ వేస్తున్నప్పుడు జుట్టు బౌన్స్ అవ్వాలి అని చెప్పాను. ‘డ్యాన్స్ కావాలి.. జుట్టు ఎగరాలి.. మామూలు డిమాండ్స్ కావు అంటూనే మళ్లీ చేశారు. అయితే ఈ చిత్రంలో రాజకీయాల గురించి ఎక్కడా చర్చించలేదు. గాజు గ్లాసు డైలాగ్ కూడా వ్యక్తిగతంగా రాశాను.
నాకూ అలాగే టైమ్ పట్టింది..
‘ఖుషి’, ‘కొమరం పులి’ సినిమాల మధ్య చాలా సంవత్సరాల గ్యాప్ ఉంది. రెండు చిత్రాలకు ఎస్.జె.సూర్య,నే దర్శకుడు. అలాగే నాకు కూడా పవన్ కల్యాణ్‌గారితో రెండో సినిమా తీయడానికి దాదాపు 14 ఏళ్లు సమయం పట్టింది.