అల్లు అర్జున్ బర్త్‌డే.. అన్నీ మంచి శకునములే!

ABN , Publish Date - Apr 07 , 2026 | 09:25 PM

భారీ విజయాలతో హ్యాట్రిక్ చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ అవార్డుతో తెలుగునటుల గౌరవాన్ని ఎంతగానో పెంచారు. రాబోయే సినిమాలతోనూ ఆయన ఊరిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 8న బన్నీ బర్త్‌డే జరుపుకుంటున్నారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.

Icon Star Allu Arjun

‘అల వైకుంఠపురములో’ సినిమాతో బంపర్ హిట్ చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) తర్వాత వరుసగా ‘పుష్ప’ (Pushpa) సిరీస్ చిత్రాలతో భారీ విజయాలను అందుకున్నారు. ‘పుష్ప’ మొదటి భాగంతో జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా నిలిచారు. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటునిగా చరిత్రలో నిలిచారు అల్లు అర్జున్. ఇక ‘పుష్ప-2’ చిత్రంతో వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరారు బన్నీ. ఇలా నటునిగానూ, స్టార్‌గానూ భళా అనిపిస్తోన్న బన్నీ ప్రస్తుతం పరభాషా దర్శకులతో వరసగా సినిమాలను ప్లాన్ చేస్తుండటం విశేషంగా మారింది. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ హీరోగా ఓ భారీ సైంటిఫిక్ ఫిక్షన్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ వ్యయంతో నిర్మిస్తోంది.


భారీ విజయాల బన్నీ...
ఆల్ ఇండియాలో అత్యధిక పారితోషికం పుచ్చుకొనే స్టార్స్‌లో ఒకరిగా దూసుకెళుతున్నారు అల్లు అర్జున్. తాత అల్లు రామలింగయ్య జీన్స్ కారణంగా బాల్యం నుంచే బన్నీ తెరపై కనిపించడానికి తహతహలాడారు. చిరంజీవి ‘డాడీ’లో కాసేపు కనిపించినా, తన డాన్స్ భళా అనిపించారు. ఇక తొలి చిత్రం ‘గంగోత్రి’లోనే హీరోగా అల్లు అర్జున్ మంచి మార్కులు సంపాదించారు. రెండో సినిమా ‘ఆర్య’తోనూ మురిపించారు. ఆ పై ‘దేశముదురు’లో సిక్స్ ప్యాక్‌తో తెలుగునాట ఓ క్రేజ్ క్రియేట్ చేశారు. ‘జులాయి, రేసుగుర్రం, సరైనోడు, దువ్వాడ జగన్నాథమ్’ చిత్రాలతో ఆకట్టుకున్నారు అల్లు అర్జున్. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో’ చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన బన్నీ.. ‘పుష్ప’ సిరీస్ చిత్రాలతో ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నారు. రాబోయే సినిమాలతోనూ తన సత్తా, తన పరిధిని మరింత విస్తరించే ప్రయత్నంలో అల్లు అర్జున్ ఉన్నారు.


పరభాషా దర్శకులతో..
తెలుగు దర్శకులతోనే బంపర్ హిట్స్ చూసిన బన్నీ.. ఇప్పుడు అట్లీ డైరెక్షన్‌లో ఓ మూవీలో నటిస్తున్నారు. దీని తర్వాత లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలోనూ నటించబోతున్నారు. ఆ పై సుకుమార్ డైరెక్షన్‌లో ‘పుష్ప-3’ మూవీలో నటించాల్సి ఉంది. అటు పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో బన్నీ నటిస్తారని టాక్. ఇక ఓ మళయాళ దర్శకునితోనూ అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఇలా పరభాషా దర్శకులతోనే ఈ ఐకాన్ స్టార్ జర్నీ చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. బన్నీ పుట్టినరోజైన ఏప్రిల్ 8న ఆయన అభిమానులు పలు సేవాకార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే అట్లీ డైరెక్షన్‌లో బన్నీ నటిస్తోన్న మూవీ టైటిల్‌ కూడా ప్రకటించబోతున్నారు. మరి ఏ టైటిల్‌తో బన్నీ - అట్లీ మూవీ వెలుగు చూస్తుందో చూడాలి. ఈ టైటిల్‌తో పాటు తను చేయాల్సిన ఇతర ప్రాజెక్ట్స్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ ఏమైనా వస్తుందేమో అని కూడా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తెలుగువాడి సత్తా ఏంటో మరింత గొప్పగా చాటేందుకు సిద్ధమవుతోన్న ఈ ఐకాన్ స్టార్‌కు హ్యాపీ బర్త్‌డే (Happy Birthday Allu Arjun). 

Updated Date - Apr 07 , 2026 | 09:25 PM