‘మసూద’ నటి అఖిల రామ్ కొత్త సినిమా.. ముసుగు తీసి వస్తున్నానంటూ కామెంట్!

ABN , Publish Date - Nov 13 , 2026 | 12:20 PM

అనుదీప్ రెడ్డి కొతూరు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పారడాక్స్ హరికథ’ నుంచి ‘గుప్పెడంత ప్రేమ’ పాట విడుదలైంది. కిరణ్, అఖిల రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 11న విడుదల కానుంది.

Paradox Harikatha

విభిన్న కథాంశాలతో రూపొందుతున్న చిన్న సినిమాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ కోవలోనే మరో ఆసక్తికరమైన చిత్రంగా ‘పారడాక్స్ హరికథ’ (Paradox Harikatha) సిద్ధమవుతోంది. అనుదీప్ రెడ్డి కొతూరు (ఏఆర్‌కే) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నుంచి తాజాగా ‘గుప్పెడంత ప్రేమ’ (Guppedantha Prema Video Song) అంటూ సాగే మెలోడీ పాటను విడుదల చేశారు. బుధవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పాటను ఆవిష్కరించారు. డిసెంబర్ 11న సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

ఐరావత సినీ కలర్స్, అగ్‌మైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై కడ్లూరి అశోక్, రాంపురం వెంకటేశ్వర్ రెడ్డి సమర్పణలో రంజిత్ కుమార్ గౌడ్, వివేకానంద, రఘు బల్లా, కవిత గోర ఈ చిత్రాన్ని నిర్మించారు. కిరణ్, రంజిత్, అఖిల రామ్, లావణ్య రెడ్డి, కీర్తి, మన్యం భాస్కర్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. మహవీర్ సంగీతాన్ని అందించారు.

పాట విడుదల కార్యక్రమంలో పాల్గొన్న నటుడు కేదార్ శంకర్ సినిమా విజువల్స్ చూశానని, హీరోహీరోయిన్లు బాగున్నారని తెలిపారు. చిన్న సినిమాలు కూడా పెద్ద విజయాలు సాధిస్తున్నాయని, ‘పారడాక్స్ హరికథ’ మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. నటుడు అంబరీష్ మాట్లాడుతూ.. చరిత్రలోని ఓ అంశాన్ని తీసుకుని ప్రస్తుత తరానికి అనుగుణంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు కనిపిస్తోందన్నారు. సినిమాలో మంచి సందేశం ఉంటుందని భావిస్తున్నానని, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

దర్శకుడు అనుదీప్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రయాణంలో తనకు అండగా నిలిచిన నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు తెరపై ఇప్పటివరకు చూడని ఓ కొత్త తరహా అంశాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నామని చెప్పారు. ఈ కథ ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని అందిస్తుందని, చిన్న సినిమాల విజయాల జాబితాలో ‘పారడాక్స్ హరికథ’ కూడా చేరుతుందనే నమ్మకం ఉందన్నారు. డిసెంబర్ 11న విడుదల కానున్న తమ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. నిర్మాత కడ్లూరి అశోక్ మాట్లాడుతూ.. ‘పారడాక్స్ హరికథ’ కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుందని తెలిపారు. సినిమా కోసం నటీనటులు, సాంకేతిక బృందం ఎంతో కష్టపడ్డారని, అన్ని హంగులతో రూపొందించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

నటి లావణ్య రెడ్డి మాట్లాడుతూ.. సినిమా కోసం టీమ్ అంతా ఎంతో శ్రమించి చిత్రీకరణ పూర్తి చేశామని తెలిపారు. విడుదల విషయంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొంటున్నామని చెబుతూ, సినిమాలో అద్భుతమైన కంటెంట్ ఉందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు సినిమా నచ్చుతుందని, మీడియా, ప్రేక్షకులు తమకు మద్దతుగా నిలవాలని కోరారు. సంగీత దర్శకుడు మహవీర్ ఈ చిత్రానికి సంగీతం అందించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు అనుదీప్ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని, ‘పారడాక్స్ హరికథ’ మంచి చిత్రంగా నిలుస్తుందని అన్నారు.

హీరో కిరణ్ మాట్లాడుతూ.. దర్శకుడు అనుదీప్‌తో కలిసి పనిచేసిన ప్రయాణంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. కథ వినగానే తనకు ఎంతో నచ్చిందని, ఇలాంటి విభిన్నమైన కథలు ప్రతి నటుడికీ చేయాలని ఉంటుందని తెలిపారు. నటి అఖిల రామ్ మాట్లాడుతూ.. సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో ‘మసూద’ సినిమాలో తనను ముసుగులో చూశారని, ఇప్పుడు ఆ ముసుగు తొలగించి ‘పారడాక్స్ హరికథ’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు.

నటుడు మన్యం భాస్కర్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో మంచి కథాంశంతో పాటు ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. గతానికి, వర్తమానానికి మధ్య దర్శకుడు చక్కటి అనుసంధానం చేశారని, ప్రేక్షకులంతా సినిమాను చూసి విజయవంతం చేయాలని కోరారు. ఇలా ‘గుప్పెడంత ప్రేమ’ పాటతో ప్రచారాన్ని ప్రారంభించిన ‘పారడాక్స్ హరికథ’.. విభిన్నమైన కథాంశం, చరిత్రకు వర్తమానానికి మధ్య ఉండే సంబంధాలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. డిసెంబర్ 11న విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Nov 13 , 2026 | 12:20 PM