Euphoria: గుణ‌శేఖ‌ర్‌.. ‘యుఫోరియా’ ట్రైల‌ర్ వ‌చ్చేసింది! ఈ సారి.. హిట్ గ్యారంటీ

ABN , Publish Date - Jan 17 , 2026 | 01:16 PM

నూతన నటీనటులతో దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘యుఫోరియా’ ట్రైల‌ర్ తాజాగా విడుద‌ల చేశారు.

నూతన నటీనటులతో దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar) తెరకెక్కిస్తున్న చిత్రం ‘యుఫోరియా’ (Euphoria). భూమికా చావ్లా (Bhumika Chawla), సారా అర్జున్ (Sara Arjun), రోహిత్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా పాట‌లు మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకున్నాయి.

అయితే.. చాలా రోజుల క్రిత‌మే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఇప్ప‌టికే విడుద‌ల కావాల్సి ఉండ‌గా వాయిదాలు ప‌డుతూ వ‌చ్చింది. కాగా తాజాగా ఇటీవ‌లే ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 6న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో ఈ రోజు (శ‌నివారం) ప్ర‌త్యేక ఈవెంట్ నిర్వ‌హించి ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి సారా అర్జున్‌, భూమిక హాజ‌రై ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.

యూత్‌ఫుల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఇప్పుడు న‌వ‌త‌రం ఎదుర్కొంటున్న డ్ర‌గ్స్ త‌ద్వారా కుటుంబాలు, కుర్ర‌కారు అనుభ‌వించే ప‌ర్య‌వ‌సనాలు, కంటికి రెప్ప‌లా కాపాడుకున్న కుమారుడు దారి త‌ప్పి డ్ర‌గ్స్ వ‌ల‌లో చిక్కుకోవ‌డం, అందుకు త‌ల్లి చేసిన ప‌నేంటి వంటి క‌థ‌క‌థ‌నాల‌తో థ్రిల్ల‌ర్‌ల‌ను త‌పించేలా సినిమాను రూపొందించిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. అంతేగాక గుణ శేఖ‌ర్ మార్క్ డైరెక్ష‌న్ కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. చూడాలి మ‌రి ఈ సినిమా ఆయ‌న‌కు పూర్వ‌వైభ‌వం తీసుక‌స్తుందో లేదో.

అయితే.. ఈ చిత్రంలో కీల‌క పాత్ర చేస్తున్న సారా అర్జున్ ఈ సినిమా చేసిన ఏడాది త‌ర్వాత అంగీక‌రించిన బాలీవుడ్ మూవీ దురంధ‌ర్‌తో బాలీవుడ్‌లో ఆరంగేట్రం చేయ‌గా ఆ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. ఇప్ప‌టికే 1200 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్ట‌డం గ‌మ‌నార్హం. కాగా ఈ యూఫోరియా సినిమాతో సారా అర్జున్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.

Updated Date - Jan 17 , 2026 | 01:16 PM