గోపీచంద్‌తో 'యాత్ర' నిర్మాతల సినిమా!
ABN , Publish Date - Mar 10 , 2026 | 08:20 PM
హీరో గోపీచంద్ ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ పూర్తి కాకముందే గోపీచంద్ మరో యాక్షన్ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
కొందరు హీరోల సినిమాలు ఫ్లాప్ కావచ్చు, కానీ నటులుగా వారెప్పుడూ ఫెయిల్ కారు. వాళ్ళు చేసే పాత్రకు సంపూర్ణ న్యాయం చేకూర్చుతుంటారు. అందుకే జయాపజయాలతో సంబంధం లేకుండా వారికి అవకాశాలు వస్తూనే ఉంటాయి. అదే కోవకు చెందిన నటుడు గోపీచంద్. వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుని సినిమాలు చేసే గోపీచంద్‌కు సాలీడ్ హిట్ వచ్చి చాలా కాలం అయ్యింది. అయినా గోపీచంద్‌కు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా గోపీచంద్ 'ఘాజీ' ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉంటే... ఈ సినిమా క్లయిమాక్స్ చిత్రీకరణ ఇప్పుడు జరుగుతోంది. ఇరవై ఐదు రోజుల పాటు జరిగే ఈ పతాక సన్నివేశాల చిత్రీకరణలో ముగ్గురు ఫైట్ మాస్టర్స్ పాల్గొంటున్నారట. ఈ హై ఓల్టేజ్ డ్రామా షూటింగ్ పూర్తి కాకమునుపే గోపీచంద్ మరో యాక్షన్ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
ఈ తాజా చిత్రానికి ఫైట్ మాస్టర్ వెంకట్ దర్శకత్వం వహించబోతున్నాడట. ఫైట్ మాస్టర్స్ మెగాఫోన్ పట్టడం అనేది ఎప్పటి నుంచో ఉంది. విజయన్, విజయ్, రాజు, రామ్ - లక్ష్మణ్ తదితరులు గతంలో దర్శకత్వం వహించి, తమ కోరికను తీర్చుకున్నవారే. ఇప్పుడు వారి బాటలో నడవాలని వెంకట్ భావిస్తున్నారు. గోపీచంద్ ను దృష్టిలో పెట్టుకునే ఈ కథ రాసినట్టు వెంకట్ చెబుతున్నారు. ఈ సినిమాను గతంలో 'యాత్ర' సినిమాను నిర్మించిన 70 ఎం.ఎం. బ్యానర్ అధినేతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించబోతున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన సమాచారాన్ని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.