ఫ్యాన్స్ ఊపిరి తీసుకోండి.. అనుకున్న టైమ్‌కే ప్రభాస్ 'స్పిరిట్'
ABN , Publish Date - May 07 , 2026 | 03:40 PM
ప్రభాస్ ‘స్పిరిట్’ చిత్రంపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా, డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘స్పిరిట్’ (Spirit) చిత్రంపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతోందని, అనుకున్న సమయానికి విడుదల కాకపోవచ్చని వస్తున్న వార్తలు అభిమానులను కాస్త ఆందోళనకు గురిచేశాయి. అయితే, ఈ ప్రచారానికి తాజాగా మేకర్స్ చెక్ పెట్టారు. సినిమా వాయిదా పడిందనే వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని చిత్ర యూనిట్ గట్టిగా బదులిచ్చింది.
ఈ ప్రాజెక్ట్ గురించి నిర్మాణ సంస్థ స్పందిస్తూ, అంతా అనుకున్న ప్లాన్ ప్రకారమే జరుగుతోందని వివరణ ఇచ్చింది. అనవసరమైన రూమర్లను నమ్మవద్దని, సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను తామే స్వయంగా అధికారికంగా వెల్లడిస్తామని స్పష్టం చేసింది. ప్రకటించిన విధంగానే 2027 మార్చి 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుందని పేర్కొంది. ఈ వివరణతో ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోవడమే కాకుండా, ‘స్పిరిట్ వాయిదా లేదు’ అనే నినాదంతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు ఇలాంటి పుకార్లు రావడం సహజమేనని చిత్ర వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ మొదటిసారి ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుండటం విశేషం. సందీప్ రెడ్డి వంగా తనదైన శైలిలో ఇంటెన్స్ యాక్షన్, బలమైన ఎమోషన్స్‌తో ఈ కథను సిద్ధం చేశారు. ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గట్లుగా ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో, గ్లోబల్ స్టాండర్డ్స్‌లో తెరకెక్కిస్తున్నారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, కథలో ఉండే డ్రామా ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చిత్ర బృందం నమ్ముతోంది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రీ నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. గతంలో సందీప్ తెరకెక్కించిన ‘యానిమల్’లో త్రిప్తి-రణబీర్ కెమిస్ట్రీ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు ‘స్పిరిట్’లో ప్రభాస్ సరసన ఆమె నటిస్తుండటంతో, వీరి జోడీ వెండితెరపై ఎలా ఉండబోతుందోనని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్క్రిప్ట్‌లో చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల షూటింగ్ ఆలస్యమవుతోందనే వార్తలు వచ్చినప్పటికీ, అవుట్‌పుట్ అద్భుతంగా రావడం కోసమే దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ‘కల్కి 2’ తో పాటు ‘ఫౌజీ’ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నప్పటికీ, ఆయన ‘స్పిరిట్’ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ సజావుగా సాగేలా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. గ్లోబల్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందుతున్న ఈ చిత్రం, ప్రభాస్ కెరీర్‌లోనే మరో మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.