తారక్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రూమర్లకు చెక్ పెట్టిన 'డ్రాగన్' మేకర్స్
ABN , Publish Date - Sep 03 , 2026 | 09:30 AM
ప్రశాంత్ నీల్, పవర్‌ఫుల్ పెర్ఫార్మర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీ లో భారీ అంచనాలే ఉన్నాయి.
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మోస్ట్ ఎవైటింగ్ చిత్రాల్లో డ్రాగన్ (Dragon) చిత్రం కూడా ఒకటి. మాస్ సినిమాల మాంత్రికుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel), పవర్‌ఫుల్ పెర్ఫార్మర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీ లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్ సోషల్ మీడియాలో రికార్డులను తిరగరాసింది. ఆ చిన్న వీడియోలో ఎన్టీఆర్ కనిపించిన రా అండ్ రస్టిక్ లుక్, ఆయన డైలాగ్స్ పలికిన తీరు, యాక్షన్ మోడ్ చూసి ఫ్యాన్స్ థ్రిల్ అయిపోయారు. ఆ గ్లింప్స్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది.
అయితే, గత కొంతకాలంగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఎన్టీఆర్‌కు తగిలిన చిన్న గాయం, ఆ తర్వాత జరిగిన సర్జరీ కారణంగా షూటింగ్ అనుకున్న వేగంతో సాగలేదనే ప్రచారం జరిగింది. అంతేకాకుండా, షెడ్యూల్స్‌లో జరిగిన మార్పుల వల్ల సినిమా విడుదల తేదీ వాయిదా పడుతుందని, అనుకున్న సమయానికి థియేటర్లలోకి రాదని రకరకాల ఊహాగానాలు వినిపించాయి. దీంతో ఎన్టీఆర్ అభిమానుల్లో కాస్త ఆందోళన నెలకొంది.
ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్పందించి అన్ని రూమర్లకు చెక్ పెట్టింది. సినిమా విడుదల విషయంలో ఎలాంటి మార్పు లేదని, ముందుగా ప్రకటించిన ప్రకారమే వచ్చే ఏడాది జూన్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని స్పష్టతనిచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్ విశ్రాంతిలో ఉన్నప్పటికీ, ఇప్పటికే పూర్తయిన సన్నివేశాలకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్ పనులను మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా పర్యవేక్షిస్తున్నారు.
మరో రెండు వారాల్లో ఎన్టీఆర్ పూర్తిగా కోలుకుని సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఆ తర్వాత నాన్‌స్టాప్‌గా షూటింగ్ నిర్వహించి, వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి మొత్తం టాకీ పార్ట్‌తో పాటు అన్ని కార్యక్రమాలను పూర్తి చేయాలని పట్టుదలగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ఎన్టీఆర్ ఆర్ట్స్ తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నటీనటుల విషయానికి వస్తే కూడా భారీ తారాగణం నటిస్తోంది.
కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ దిగ్గజ నటుడు అనిల్ కపూర్, మలయాళ వర్సటైల్ యాక్టర్ బిజు మీనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కేజీఎఫ్, సలార్ సినిమాలతో తన మ్యూజిక్‌తో థియేటర్లను దద్దరిల్లజేసిన రవి బస్రూర్ ఈ చిత్రానికి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన అందించే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయం. మొత్తానికి అన్ని అడ్డంకులను దాటుకుంటూ డ్రాగన్ తన వేగవంతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.