గాడ్ ఆఫ్ వార్.. చివరికి యన్టీఆర్ చేతికే

ABN , Publish Date - May 06 , 2026 | 03:14 PM

తెలుగు చిత్రసీమలో శ్రీమహావిష్ణువు, మహాశివుడు, శ్రీరామ, శ్రీకృష్ణ, శ్రీనివాస వంటి దేవతామూర్తుల గాథలతో సినిమాలు రూపొంది ఘనవిజయం సాధించాయి.

God of War

తెలుగు చిత్రసీమలో శ్రీమహావిష్ణువు, మహాశివుడు, శ్రీరామ, శ్రీకృష్ణ, శ్రీనివాస వంటి దేవతామూర్తుల గాథలతో సినిమాలు రూపొంది ఘనవిజయం సాధించాయి. ఈ చిత్రాలలో మన స్టార్స్ కీలక పాత్రలు ధరించారు. అయితే ఇప్పటి దాకా దేవసేనాని కుమారస్వామి పాత్రలో స్టార్ హీరోస్ నటించి అలరించింది తెలుగునాట కనిపించదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు త్రివిక్రమ్ (Trivikram) డైరెక్షన్ లో మురుగ పాత్రలో యన్టీఆర్ (NTR) నటించే పౌరాణిక చిత్రం త్వరలోనే ఆరంభం కానుందని విశేషంగా వినిపిస్తోంది.


గాడ్ ఆఫ్ వార్ గా పేరొందిన సుబ్రహ్మణ్య స్వామి గాథతో యన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ పౌరాణిక చిత్రం రూపొందిస్తారని చాలా రోజుల క్రితమే వినిపించింది. ఆ సమయంలో యన్టీఆర్ వార్ -2 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అప్పట్లో ముంబై వెళ్తూ యన్టీఆర్ మురుగన్ బుక్ ను కూడా తీసుకువెళ్ళడం ఎయిర్ పోర్ట్ పిక్చర్స్ లో క్లియర్ గా కనిపించింది. దాంతో కుమారస్వామి గాథతో త్రివిక్రమ్ తీయబోయే పౌరాణిక చిత్రంలో యన్టీఆర్ నటిస్తారని అందరూ భావించారు. అయితే మధ్యలో అదే కథను అల్లు అర్జున్ కు కూడా త్రివిక్రమ్ వినిపించారనే టాక్ బయలు దేరింది. ఆ తరువాత బన్నీ ఇతర సినిమాలతో బిజీ కావడం, మళ్ళీ ఆ స్క్రిప్ట్ యన్టీఆర్ చెంతకే చేరిందని వినిపిస్తోంది.


ఇక ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ మే 20వ తేదీన యన్టీఆర్ బర్త్ డే సందర్భంగా వెలువడుతుందని సమాచారం. యన్టీఆర్ కెరీర్ లో ఇప్పటి దాకా శ్రీరామ, భక్త మార్కండేయ, యువ యమ వంటి పౌరాణిక పాత్రల్లో కనిపించారు. రామాయణం తరువాత యన్టీఆర్ నటించబోయే పూర్తిస్థాయి పౌరాణిక చిత్రం ఇదే అవుతుంది. పౌరాణిక పాత్రల పోషణకు నందమూరి వంశం పెట్టింది పేరుగా నిలచింది. నటరత్న యన్టీఆర్ ప్రపంచంలోనే అత్యధిక పౌరాణిక పాత్రలు పోషించిన నటునిగా నిలిచారు. ఆయన నటవారసుడైన బాలకృష్ణ తన తరం హీరోల్లో ఎక్కువ పౌరాణిక చిత్రాల్లో నటించిన కథానాయకునిగా ఉన్నారు. ఇప్పుడు యంగ్ టైగర్ యన్టీఆర్ కూడా అదే తీరున సాగుతారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Updated Date - May 06 , 2026 | 03:20 PM