Balakrishna: గాడ్ ఆఫ్ మాసెస్ మళ్లీ వేట మొదలుపెట్టాడు.. టీజర్‌తో సోషల్ మీడియా షేక్!
ABN , Publish Date - Jun 12 , 2026 | 10:12 AM
బాలకృష్ణ తాజా టీజర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. గోపీచంద్ మలినేని మూవీతో పాటు కొరటాల శివ, వివేక్ ఆత్రేయ ప్రాజెక్టులపై ఆసక్తికర విశ్లేషణ.
టాలీవుడ్‌లో మాస్ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు నందమూరి బాలకృష్ణ (Balakrishna). ఇక అభిమానులు ముద్దుగా గాడ్ ఆఫ్ మాసెస్ పిలుచుకుంటుంటారు. ఇది ఏమాత్రం సందేహం లేని వాస్తవం. నాలుగు దశాబ్దాలుగా వెండితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న ఈ నటసింహం.. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎవరికీ అందనంత ఎత్తులో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా అఖండ సినిమా నుంచి ఆయన తన స్క్రిప్ట్ సెలెక్షన్ విధానాన్ని పూర్తిగా మార్చేశారు. సినిమా సినిమాకు తనలోని మాస్ యాంగిల్‌ను పదింతలు పెంచుకుంటూ.. థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తున్నారు.
బోయపాటి శ్రీనుతో చేసిన అఖండ సృష్టించిన సునామీ ఒక చరిత్ర. ఆ తర్వాత గోపీచంద్ మలినేని (Gopichand Malineni) తో చేసిన వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద చేసిన ఊచకోత, బాబీ దర్శకత్వంలో వస్తున్న డాకు మహారాజ్ లో చూపించిన విలక్షణత.. ఇలా ఒకదానిని మించి మరొకటి అన్నట్లుగా మాస్ అనే పదానికి సరికొత్త అర్థం చెబుతూ వస్తున్నారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా.. తన వయసుకు తగ్గట్లుగా, తన ఇమేజ్‌కు సరిపోయే పవర్‌ఫుల్ పాత్రలను ఎంచుకుంటూ కుర్ర హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక ఇప్పుడు మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రంలో బాలయ్య అవతారాన్ని చూస్తుంటే గూస్‌బంప్స్ అనే మాట కూడా తక్కువే అని చెప్పాలి.
ముంబై గ్యాంగ్‌స్టర్ నేపథ్యంతో సాగే ఈ కథలో ఆయనను ఊహించని రేంజ్‌లో, అత్యంత పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నారు. ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్ నెట్టింట చేసిన బ్లాస్ట్ అంతా ఇంతా కాదు. నందమూరి అభిమానులకు కావాల్సినంత డోస్ ఈ టీజర్‌తోనే ఇచ్చేశారు. ముఖ్యంగా క్రేన్‌తో చూపించిన యాక్షన్ సీన్ అయితే అభిమానులకే కాదు, మామూలు ఆడియెన్స్‌కు కూడా గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇక ఇందులో మ్యూజిక్ సెన్సేషన్ థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే వేరే లెవల్. బాలయ్య సినిమా అనగానే థమన్ (Thaman) కు ఎక్కడిలేని ఎనర్జీ వస్తుందనే మాటను ఆ టీజర్ బీజీఎమ్ మరోసారి అక్షరసత్యం చేసింది.
ఈ కథలన్నీ కూడా బాలకృష్ణను పాన్ ఇండియా లెవల్లో టాప్ రేసులో నిలబెడుతున్నాయి. అయితే, అసలు సిసలైన సర్ప్రైజ్ ఆయన తదుపరి సినిమాల లైనప్‌లో దాగి ఉంది. తన ఇమేజ్‌కు పూర్తి భిన్నమైన దర్శకులతో ఆయన జతకట్టడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ సినిమాలు తీసే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ భారీ మూవీ తెరకెక్కబోతోంది. ఈ కాంబినేషన్ అనౌన్స్‌మెంట్ రాగానే పొలిటికల్ సర్కిల్స్‌తో సహా టాలీవుడ్ అంతా ఉలిక్కిపడింది.
ఆ వెంటనే.. డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్ చేసే యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ (Vivek Athreya) తో ఒక మూవీ ఉండబోతోందని బర్త్‌డే రోజున గట్టి హింట్ ఇచ్చారు. ఇది నిజంగా అభిమానులకు ఊహించని కానుక. వివేక్ ఆత్రేయ మార్క్ కథలో బాలయ్య మార్క్ యాక్షన్ ఎలా ఉండబోతోంది అనేది అందరిలోనూ విపరీతమైన క్యూరియాసిటీని పెంచుతోంది. ఒకవైపు పక్కా మాస్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్.. మరోవైపు పదునైన పొలిటికల్ డ్రామా.. ఇంకోవైపు సరికొత్త ప్రయోగాత్మక జానర్.. ఇలా ప్రస్తుతం బాలయ్య చేయబోతున్న ఈ మూడు సినిమాలు వేటికవే పూర్తి భిన్నంగా ఉండబోతున్నాయి. రొటీన్‌కు భిన్నంగా అడుగులు వేస్తూ ‘గాడ్ ఆఫ్ మాసెస్’ (God Of Masses) అనే తన బిరుదుకు మించి, నటసింహంగా మరోసారి సిల్వర్ స్క్రీన్ మీద శివతాండవం చేయబోతున్నారు.