ఇకపై.. టిక్కెట్ రేట్లు పెంచం! ప్రభుత్వం జీవోలు వచ్చినా సరే
ABN , Publish Date - May 12 , 2026 | 08:20 PM
తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ కోసం ‘పర్సంటేజ్ సిస్టమ్’ అమలు చేయాలని ఎగ్జిబిటర్స్ డిమాండ్. లేదంటే సినిమాలు ప్రదర్శించబోమని స్పష్టం చేశారు.
భారతదేశమంతటా 'పర్సంటేజ్ సిస్టమ్' అమలులో ఉందని, మన తెలుగు రాష్ట్రాలలోనే ఇది అమలు కావడం లేదని పర్సంటేజ్ సిస్టమ్ అయితేనే సినిమాలు ఆడతామని- లేకపోతే లేదని ఎగ్జిబిటర్స్ తేల్చి చెప్పారు. మంగళవారం పలువురు ఎగ్జిబిటర్స్ థియేటర్స్ (Tollywood Exhibitors) మనుగడ కోసం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ అభిప్రాయాలను మీడియా ముందు వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో చదలవాడ శ్రీనివాసరావు, సునీల్ నారంగ్, శిరీష్, విజయేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, అనుపమ్ రెడ్డి, శ్రీధర్, బాలగోవింద్ వంటి ప్రముఖ ఎగ్జిబిటర్స్ పాల్గొన్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 1400 సింగిల్ థియేటర్స్ నడుస్తున్నాయని, దాదాపు 1300 థియేటర్స్ బంద్ అయ్యాయని థియేటర్స్ యజమానులు గుర్తు చేశారు. మల్టీప్లెక్స్ థియేటర్స్ కు పదిహేనేళ్ళుగా నిర్మాతలు పర్సంటేజ్ ఇస్తున్నారని - సింగిల్ స్క్రీన్స్ పై సవతి ప్రేమ చూపిస్తున్నారని కొందరు వాపోయారు. ఇదే కొనసాగితే మరిన్ని థియేటర్స్ మూతపడే అవకాశం ఉందని వక్తలు తెలిపారు.
మూడు నెలలే లాభాలు...
సింగిల్ థియేటర్స్ లో మోడరన్ టెక్నాలజీ అందుబాటులో లేదని కొందరు ఆరోపిస్తున్నారు. అదే సింగిల్ స్క్రీన్స్ లో సైతం పర్సంటేజ్ సిస్టమ్ అమలయితే, ఆ థియేటర్స్ సైతం అదునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సాగుతాయని ఎగ్జిబిటర్స్ అన్నారు. పర్సంటేజ్ సిస్టమ్ లో మూడు నెలలు 'లాస్'లో నడచినా, తొమ్మిది నెలలు లాభాలు చూడవచ్చునని వారు అభిప్రాయపడ్డారు. అదే 'రెంటల్ విధానం'లో కేవలం మూడు నెలలే లాభాలు ఉంటాయని, మిగిలిన నెలలన్నీ నష్టాలతో సాగాలని అన్నారు.
టిక్కెట్ రేట్స్ పెంచం..!
నిర్మాతల్లో 99 శాతం మంది 'పర్సంటేజ్' సిస్టమ్ కే జై కొడుతున్నారని వక్తలు తెలిపారు. మిగిలిన వారు సైతం తమ ఆవేదనను అర్థం చేసుకొని ముందడుగు వేస్తారని ఆశించారు. టాప్ స్టార్స్ సైతం థియేటర్స్ మనుగడ కోసం తమ నిర్మాతలను 'పర్సంటేజ్' వైపు నడిపిస్తారని అభిలషించారు. ప్రభుత్వం టిక్కెట్ రేట్స్ పెంచడానికి అనుమతి ఇచ్చినా, తాము పెంచబోమని స్పష్టం చేశారు. మన నిర్మాతలు ముంబైలో ఉంటున్నారని, అక్కడ ఓటీటీ బిజినెస్ సాగితేనే ఇక్కడ సినిమాలు ఆరంభిస్తున్నారని గుర్తు చేశారు. సింగిల్ స్క్రీన్స్ లేకుంటే అందరూ మల్టీప్లెక్స్ థియేటర్స్ కోసం ముంబైలో కూర్చునే పరిస్థితి వస్తుందనీ చెప్పారు. అతి త్వరలోనే ఓ బిగ్ స్టార్ మూవీని 'పర్సంటేజ్ సిస్టమ్'లోనే రిలీజ్ చేస్తామనీ అన్నారు. అదే జరిగితే అన్ని థియేటర్స్ లో పర్సంటేజ్ సిస్టమ్ త్వరలోనే అమలవుతుందని చెప్పవచ్చు. ఏమవుతుందో చూడాలి.