బన్నీ.. స్నేహితులే భాగస్వాములుగా...
ABN , Publish Date - Feb 20 , 2026 | 09:55 AM
స్నేహబంధమూ.. ఎంత మధురమూ... అంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్రెండ్స్ పాడుకుంటున్నారు. తన చిన్ననాటి మిత్రులను చిత్ర నిర్మాణంలో భాగస్వాములను చేస్తున్నారు బన్నీ.
అల్లు అర్జున్ (Allu Arjun) వరుసగా రెండు భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒక చిత్రాన్ని ప్రస్తుతం అట్లీ కుమార్ (Atlee) దర్శకత్వంలో 'సన్ పిక్చర్స్' సంస్థ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి కాగానే లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో బన్నీ నటించే చిత్రం మొదలవుతుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. లోకేశ్ కనగరాజ్ సినిమాలో తనకు అత్యంత ఆప్తులైన బన్నీ వాస్, చిన్ననాటి స్నేహితులు స్వాతి, నటరాజ్, సందీప్‌ను కూడా భాగస్వాములుగా చేస్తున్నారట బన్నీ.
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ విషయాన్ని విశేషంగా ముచ్చటించు కుంటున్నారు. అల్లు అర్జున్‌కు బన్నీ వాస్ అత్యంత సన్నిహితుడన్న విషయం టాలీవుడ్ లో అందరికీ తెలుసు. వీరిలో నటరాజ్, సందీప్ బన్నీకి స్కూల్ మేట్స్ కాగా, స్వాతి సమీప బంధువు, చిన్ననాటి నేస్తమని తెలుస్తోంది. గతంలో తన తల్లి వైపు బంధువులైన 'ముత్తంశెట్టి మీడియా' సంస్థను 'పుష్ప-1'లో భాగస్వామిగా చేశారు బన్నీ. ఇప్పుడు అదే తీరున తన 23వ చిత్రంలో బన్నీ చిన్ననాటి మిత్రులను భాగస్వాములుగా చేయడం విశేషంగా మారింది.
స్నేహబంధంలో మధురాతి మధురాన్ని ఆస్వాదించే బన్నీకి అభిమానులన్నా ఎంతో ప్రీతి! తనను ఎంతగానో అభిమానిస్తూ, కొన్నిసార్లు ఎంతో దూరం నుంచి తనను కలవడానికి వచ్చే ఫ్యాన్స్‌ను బన్నీ సాదరంగా ఆహ్వానిస్తుంటారు. అంతేకాదు, బన్నీ ఫ్యాన్స్ ఓ సైన్యంగా మారి తమ హీరో పేరు ప్రఖ్యాతులను దశదిశలా మారుమోగేలా చేసేందుకు కృషి చేస్తుంటారు. ఇటీవల బెంగళూరులో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్‌ను నెలకొల్పారు అభిమానులు.
అక్కడే భవిష్యత్‌లో బన్నీ ఫ్యాన్స్ ఎలా నడచుకోవాలి అన్న అంశంపై ప్రణాళిక రూపొందించారట. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు బన్నీని ఎంతగానో అభిమానించే కేరళ స్టేట్‌లోనూ, కన్నడ, తమిళ సీమల్లోనూ ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్స్‌ను ఓ పద్ధతి ప్రకారం ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రచించారట. 'పుష్ప-2' తరువాత బన్నీకి ఉత్తరాదిన సైతం మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. దీనిని దృష్టిలో పెట్టుకొని నార్త్ ఇండియాలోనూ బన్నీ ఫ్యాన్స్ అసోసియేషన్‌ను నెలకొల్పే యోచనలో ఉన్నారు అభిమానులు.
బన్నీ తన సన్నిహితులను నిర్మాతలుగా మార్చడం, ఫ్యాన్స్‌ను ఓ పద్ధతి ప్రకారం నడిపించడం గురించి తెలుగు చిత్రసీమలో పలువురు చర్చిస్తున్నారు. ఒకప్పుడు చిరంజీవి ఫ్యాన్స్‌ను ఓ క్రమశిక్షణతో మెలిగేలా చేయడంలో బన్నీ తండ్రి అల్లు అరవింద్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు తండ్రి బాటలోనే పయనిస్తూ బన్నీ తన అభిమానులను క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా తీర్చిదిద్దనున్నారని వినిపిస్తోంది. బన్నీ తరపున చేసే సేవా కార్యక్రమాల్లోనూ పాలు పంచుకోవడమే కాకుండా, ఆయన సినిమాల విడుదల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫ్యాన్స్ జాగ్రత్తలు తీసుకుంటారట! ఏది ఏమైనా రాబోయే బన్నీ రెండు చిత్రాలకు ఎంతో క్రేజ్ ఉంది. ఆ సినిమాల విడుదల సమయంలో బన్నీ ఫ్యాన్స్ ఏ తీరున వ్యవహరిస్తారో చూడాలి.