బాలీవుడ్‌కు.. అల్లు అర్జున్‌ షిప్ట్!

ABN , Publish Date - Apr 21 , 2026 | 10:28 PM

'రాకా' సినిమా షూటింగ్ కోసం బన్నీ తన మకాంను తాత్కాలికంగా ముంబైకి మార్చబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Allu Arjun

'పుష్ప 2'తో వచ్చిన క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాలనే కసితో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సినిమాలను చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రాకా (Raaka) మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం బన్నీ తన మకాంను తాత్కాలికంగా ముంబైకి మార్చబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా హైదరాబాద్ నుంచి ముంబైకి రాకపోకలు సాగించడం ఇబ్బందిగా మారడంతో, షూటింగ్ సజావుగా సాగడం కోసం అక్కడ ఒక లగ్జరీ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం.

దీనివల్ల పనుల ఒత్తిడి తగ్గడమే కాకుండా, కుటుంబంతో గడిపే సమయం కూడా దొరుకుతుందని ఆయన భావిస్తున్నారట. అయితే, ముంబైలో అల్లు అర్జున్ సొంత ఇల్లు కొన్నారని లేదా మూడేళ్ల పాటు అక్కడే ఉండిపోతారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలుస్తోంది. కేవలం సినిమా అవసరాల రీత్యా అద్దె ప్రాతిపదికన మాత్రమే అకామడేషన్ తీసుకున్నట్లు సమాచారం. దర్శకుడు అట్లీ సైతం అదే ప్రాంగణంలో ఉంటూ సినిమా పనులను పర్యవేక్షించనున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్, రీ-రికార్డింగ్ వంటి కీలకమైన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముంబై కేంద్రంగానే జరగనున్నాయి. ముంబైని వేదికగా ఎంచుకోవడానికి ప్రధాన కారణం అక్కడ అందుబాటులో ఉన్న సాంకేతిక వనరులు. హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్‌లతో మీటింగ్‌లు, అంతర్జాతీయ సంస్థలతో టైఅప్స్ పెట్టుకోవడానికి ముంబై అత్యంత అనువైన ప్రాంతం. హైదరాబాద్ లేదా చెన్నైలో ఉన్న పరిమిత వనరుల కంటే, గ్లోబల్ స్టాండర్డ్స్‌లో సినిమాను తీర్చిదిద్దడానికి ముంబైలో ఉండటమే సరైన నిర్ణయమని చిత్ర బృందం భావిస్తోంది.

మరోవైపు సినిమా విడుదల తేదీపై ఇంకా స్పష్టత రానప్పటికీ, ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ పూర్తి చేయాలని అల్లు అర్జున్, అట్లీ పట్టుదలతో ఉన్నారు. గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ పనులకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉండటంతో, ముందుగానే షూటింగ్ పార్ట్‌ను ముగించాలని చూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి వస్తున్న రూమర్లు ఒక ఎత్తైతే, తాజాగా సంగీత దర్శకుడు సాయి అభ‌యంకర్ చేసిన కామెంట్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

'రాకా' మ్యూజిక్ గురించి ఆయన మాట్లాడుతూ.."రాకా కోసం మొదటిసారి అట్లీని కలిసినప్పుడు ఈ సినిమాకి ఎలాంటి సౌండింగ్ ఇవ్వాలి, ఎలాంటి ట్రాక్ ఉండాలి అనే విషయంలో ఆయనకు ఒక క్లియర్ విజన్ ఉంది. ఆ విజన్‌కు తగ్గట్టుగా నేను సిద్ధం చేసిన ట్రాక్స్ అట్లీకి, అల్లు అర్జున్ గారికి ఎంతో నచ్చేశాయి. ఈ సినిమా మ్యూజిక్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండాలనేదే మా ప్రధాన టార్గెట్" అని సాయి అభ్యంకార్ తెలిపారు. మరి ఈ 'రాకా' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి!

Updated Date - Apr 21 , 2026 | 10:28 PM