'రాకా' కోసం.. బన్నీ- అట్లీ భారీ రెమ్యునరేషన్‌! ఒక్కొక్క‌రికి ఎన్ని కోట్లు ఇచ్చారంటే

ABN , Publish Date - Apr 09 , 2026 | 03:54 PM

ఒక సినిమా బడ్జెట్ 800 కోట్లు అంటే అది మామూలు విషయం కాదు. అందులోనూ సగం బడ్జెట్ కేవలం రెమ్యునరేషన్లకే ఖర్చవుతోంది అంటే ఆ ప్రాజెక్ట్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

raaka

ఒక సినిమా బడ్జెట్ 800 కోట్లు అంటే అది మామూలు విషయం కాదు. అందులోనూ సగం బడ్జెట్ కేవలం రెమ్యునరేషన్లకే ఖర్చవుతోంది అంటే ఆ ప్రాజెక్ట్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబినేషన్‌లో వస్తున్న రాకా (Raaka) మూవీ ఇప్పుడు సరిగ్గా ఇలాంటి చర్చలకే దారితీస్తోంది. పుష్ప-2తో ఇండియన్ బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించిన బన్నీ, ఈసారి అట్లీతో కలిసి అంతకు మించిన ప్లాన్‌తో మన ముందుకు వస్తున్నారు. మరి ఈ భారీ బడ్జెట్ వెనుక ఉన్న లెక్కలేంటి..?

సన్ పిక్చర్స్ (Sun Pictures) బ్యానర్‌పై కళానిధి మారన్ (Kalanithi Maran) ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా మొత్తం బడ్జెట్ దాదాపు 800 నుంచి 900 కోట్లుగా ప్రచారంలో ఉంది. అయితే ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సుమారు 400 కోట్లు కేవలం నటీనటుల, సాంకేతిక నిపుణుల పారితోషికాలకే కేటాయించారట. మిగిలిన బడ్జెట్‌తో సినిమా ప్రొడక్షన్‌, గ్రాఫిక్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను ప్లాన్ చేస్తున్నారు. ఒక ఇండియన్ సినిమా బడ్జెట్‌లో సగం కేవలం రెమ్యునరేషన్లకే వెళ్లడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు.

ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. పుష్ప-2 కోసం లాభాలతో కలిపి ఆయన 350 కోట్ల వరకు అందుకున్నట్లు టాక్ ఉంది. ఇప్పుడు రాక సినిమా కోసం బన్నీకి దాదాపు 180 కోట్ల ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్ ఇస్తున్నారట. దీనితో పాటు లాభాల్లో కూడా ఆయనకు భారీ వాటా ఉండబోతోంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఒక్క సినిమాతో బన్నీ 300 కోట్ల మార్కును చాలా సులువుగా దాటేస్తారని తెలుస్తోంది. అట్లీ కూడా జవాన్ సక్సెస్ తర్వాత తన రేంజ్‌ను పెంచుకున్నారు. ఈ మూవీ కోసం ఆయనకు 100 కోట్లకు పైగానే చెల్లిస్తున్నట్లు సమాచారం.

కేవలం హీరో, డైరెక్టర్ మాత్రమే కాదు, ఈ సినిమాలో నటించే మిగతా స్టార్స్ కూడా భారీగానే వసూలు చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణే (Deepika Padukone) ఇందులో మెయిన్ రోల్ చేస్తోంది, ఆమెకు 25 కోట్లకు పైగా పారితోషికం ఇస్తున్నారు. అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ఈ సినిమాలో ఒక సరికొత్త అవతారంలో కనిపించబోతోంది. ఇప్పటి వరకు హీరోయిన్‌గా అలరించిన రష్మిక, ఈసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించనుండటం విశేషం. ఈ ప్రయోగం కోసం ఆమెకు 7 కోట్లు ఇస్తున్నారు. సంగీత దర్శకుడిగా యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ (Sai Abhyankkar)ను ఎంపిక చేశారు.

ఆయన పారితోషికం కూడా 5 కోట్లు దాటినట్లు వినికిడి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బన్నీ పుట్టినరోజున విడుదలైన బీస్ట్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. నిజానికి ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలని మొదట అనుకున్నారు. కానీ నిర్మాణంలో క్వాలిటీ కోసం, గ్రాఫిక్స్ పనుల కోసం చిత్ర యూనిట్ మరికొంత సమయం తీసుకోవాలని నిర్ణయించుకుంది. అందుకే వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రాక థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Apr 09 , 2026 | 04:06 PM