Fncc Awards: ఘ‌నంగా.. FNCC అవార్డుల ప్ర‌ధానం

ABN , Publish Date - Jan 02 , 2026 | 05:57 AM

హైదరాబాద్‌లో FNCC సినీ అవార్డ్స్ 2025 ఘనంగా జరిగాయి. ఉత్తమ చిత్రంగా ‘కోర్ట్’, ఉత్తమ దర్శకుడు, హీరో, హీరోయిన్ అవార్డులు ‘రాజు వెడ్స్ రాంబాయి’కి దక్కాయి.

Fncc Awards

హైదరాబాద్‌లో బుధవారం రాత్రి ఫిల్మ్‌ నగర్‌ కల్చరల్‌ సెంటర్‌ (ఎఫ్‌.ఎన్‌.సి.సి) (FNCC Awards) సినీ పురస్కారాల వేడుక వైభవంగా జరిగింది. చిన్న సినిమాలు, కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 2025 సంవత్సరానికి గానూ పలు విభాగాల్లో ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన‌ అవార్డులను అంద‌జేశారు. ఈ సందర్భంగా ఉత్తమ చిత్రంగా ‘కోర్ట్‌’ ఎంపిక కాగా, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ కథానాయకుడు, ఉత్తమ కథానాయిక విభాగాల్లో ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ (Raju Weds Rambai) చిత్రం అవార్డులను దక్కించుకుంది.

‘కోర్ట్‌’ చిత్ర దర్శక–నిర్మాతలు రామ్‌ జగదీశ్‌, దీప్తి గంటా, అలాగే ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ నిర్మాతలు వేణు ఊడుగుల, రాహుల్‌ మోపిదేవి, దర్శకుడు సాయిలు కంపాటి, హీరో అఖిల్‌రాజ్‌లకు ప్రముఖుల చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు. ఈ అవార్డులను సినీ ప్రముఖులు అల్లు అరవింద్ ( allu arvind), అశ్వనీదత్ (ashwinidutt), ఎఫ్‌.ఎన్‌.సి.సి అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత కె.ఎస్‌.రామారావు (KS Rama Rao) ప్రదానం చేశారు. జ్ఞాపికతో పాటు ప్రతి విజేతకు రూ.25 వేల నగదు బహుమతి అందించారు.

Fncc Awards

ఈ వేడుకలో భాగంగా నిర్మాతలుగా ఐదు దశాబ్దాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న అల్లు అరవింద్‌, అశ్వనీదత్‌, అలాగే సినీ–రాజకీయ రంగ ప్రముఖుడు కాజా సూర్యనారాయణను ఎఫ్‌.ఎన్‌.సి.సి కమిటీ ప్రత్యేకంగా సన్మానించింది. అదే వేదికపై వి.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆధ్వర్యంలో టెలివిజన్‌ పురస్కారాల ప్రదాన కార్యక్రమం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో కె.ఎల్‌. నారాయణ, అశోక్‌కుమార్‌ సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

Updated Date - Jan 02 , 2026 | 07:27 AM