విశ్వంభర రిలీజ్ డేట్‌పై క్లారిటీ! చిరంజీవి బర్త్‌డేకు.. మెగా సర్‌ప్రైజ్?
ABN , Publish Date - Jul 30 , 2026 | 12:16 PM
ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా 'విశ్వంభర' టీజర్, రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశమున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi,) స్క్రీన్ మీద కనిపిస్తే చాలు, బాక్సాఫీస్ దగ్గర పూనకాలు రావడం ఖాయం. ముఖ్యంగా సోషియో ఫాంటసీ కథల్లో ఆయన యాక్టింగ్, గ్రేస్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఇలాంటి జానర్ లో వచ్చిన సినిమాలు ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో మనకు స్పష్టంగా తెలుసు. ఇప్పుడు అదే మ్యాజిక్ ను రిపీట్ చేయడానికి విశ్వంభర (Viswambhara)తో మన ముందుకు వస్తున్నారు. 'బింబిసార' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు వశిష్ట (Vassishta)ఈ సినిమాను అత్యద్భుతమైన విజువల్ వండర్ గా మలుస్తున్నారు.
అయితే, గత కొద్ది రోజులుగా సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన టాక్ నడుస్తోంది. 'విశ్వంభర' మూవీ అక్టోబర్ 16న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుందనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. కానీ, దీనిపై మేకర్స్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అభిమానుల్లో కాస్త కన్ఫ్యూజన్ నెలకొంది. సినిమా అక్టోబర్ లో వస్తుందా లేక ముందే అనుకున్నట్లుగా సంక్రాంతికి వెళుతుందా అనే సందిగ్ధంలో మెగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ కన్ఫ్యూజన్ అంతటికీ మెగాస్టార్ పుట్టినరోజే సరైన సమాధానం ఇస్తుందని సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది.
ప్రస్తుతానికి సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్, ముఖ్యంగా గ్రాఫిక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయట. సోషియో ఫాంటసీ మూవీకి విజువల్ ఎఫెక్ట్స్ ప్రాణం కావడంతో చిత్ర బృందం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా వర్క్ కంప్లీట్ చేస్తోందని టాక్. ఈ పనులన్నీ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత, ఫైనల్ రిలీజ్ డేట్ ని చిరంజీవి జన్మదినం కానుకగా అనౌన్స్ చేయనున్నారని సరికొత్త బజ్ క్రియేట్ అయింది.
ఇక ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. 'విశ్వంభర'లో చిరంజీవి సరసన గ్లామర్ క్వీన్ త్రిష కథానాయికగా నటిస్తోంది. దాదాపు 18 ఏళ్ల తర్వాత వీరిద్దరి సూపర్ హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుండటం ఫ్యాన్స్ కు డబుల్ కిక్ ఇస్తోంది. అలాగే బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ ఈ సినిమాలో మెయిన్ విలన్ గా పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు.
ఆషికా రంగనాథ్, సురభి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 22న కేవలం రిలీజ్ డేట్ మాత్రమే కాకుండా, ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించేలా ఒక పవర్ ఫుల్ టీజర్ లేదా గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. మొత్తానికి 'విశ్వంభర' సినిమా మెగా అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుడికి కూడా ఒక అద్భుతమైన విజువల్ ట్రీట్ ఇవ్వబోతోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.