రిలీజ్‌కు ముందే పది కోట్ల వ్యూస్‌ టార్గెట్‌!

ABN , Publish Date - Apr 08 , 2026 | 04:49 PM

ప్రస్తుతం ఫిల్మ్ మేకర్స్ లక్ష్యం వంద మిలియన్ వ్యూస్‌ మీద ఉంది. తమ సినిమాలోని పాట విడుదలైతే... మూవీ రిలీజ్‌కు ముందే అది పది కోట్ల వ్యూస్‌ను దాటలని వారు భావిస్తున్నారు.

Telugu Movies

ఒకప్పుడు ఓ పాట మిలియన్ వ్యూస్ సాధించిందంటేనే గొప్పగా చెప్పుకొనేవారు. ఇప్పుడు రిలీజ్‌కు ముందే వంద మిలియన్ వ్యూస్ సాధించిన సాంగ్స్ గురించి గొప్పగా మాట్లాడు కుంటున్నారు. ఈ ముచ్చట్లకు కారణమైన సాంగ్స్ ఏవో గుర్తు చేసుకుందాం.

టాప్ స్టార్స్ సినిమాల పాటలు విశేషాదరణ పొందడం, మిలియన్స్ వ్యూస్ సంపాదించడం కొత్తేమీ కాదు. ఒకప్పుడు వంద మిలియన్స్ చూడాలంటే సూపర్ హిట్ మూవీ సాంగ్స్ కైనా కొంత సమయం పట్టేది. ఇప్పుడు రిలీజ్ కు ముందే కొన్ని చిత్రాల్లోని పాటలు 'వంద మిలియన్ వ్యూస్' సంపాదించేసి ప్రేక్షకులను మరింతగా ఆకర్షిస్తున్నాయి. సంక్రాంతి కానుకగా వచ్చి ఘనవిజయం సాధించిన 'మన శంకరవరప్రసాద్ గారు'లోని 'మీసాల పిల్లా...' సాంగ్ రిలీజ్ కు ముందే వంద మిలియన్ వ్యూస్ పోగేసింది. ఇప్పటికి 155 మిలియన్ వ్యూస్ సాధించింది. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నటించిన 'పెద్ది' సినిమాలోని 'చికిరి....' సాంగ్ మరింత వేగంగా వంద మిలియన్ వ్యూస్ పోగేసింది. ప్రస్తుతం 200 మిలియన్ వ్యూస్ వైపు పరుగు తీస్తోంది. ప్రస్తుతం నాని హీరోగా రూపొందిన 'ద ప్యారడైజ్'లోని 'ఆయా షేర్...' సాంగ్ కూడా వంద మిలియన్ వ్యూస్ మార్కును దాటేసింది. ఆగస్టు 21న 'ద ప్యారడైజ్' మూవీ ప్రేక్షకులను పలకరించనుంది. 'ఆయా షేర్..' పాట కారణంగా 'ద ప్యారడైజ్'పై ఓ స్పెషల్ క్రేజ్ ఏర్పడింది.


కొన్ని పాటలు సినిమా రిలీజ్ కు ముందు భలేగా ఊపేసి, తరువాత చప్పున చల్లారి పోతుంటాయి. కానీ, కొన్ని సాంగ్స్ సినిమా రిలీజయ్యాకే ఊపందుకొని మరింత ఆదరణ పొందుతాయి. అలా 'యూ ట్యూబ్'లో రిలీజయ్యాక విశేషంగా ఆకట్టుకున్న పాటల్లో 'అల వైకుంఠపురములో'లోని పాటలు చోటు దక్కించుకున్నాయి. 'అల వైకుంఠపురములో' సినిమాలోని 'బుట్టబొమ్మా...' అంటూ సాగే పాట ఇప్పటికే 937 మిలియన్ వ్యూస్ పోగేసింది. మరో 63 మిలియన్ వ్యూస్ ను ఈ పాట సంపాదించ గలిగితే వెయ్యి మిలియన్ వ్యూస్ అంటే 'బిలియన్ వ్యూస్' సాధించిన మొదటి తెలుగు పాటగా చరిత్ర సృష్టిస్తుంది. 'అల వైకుంఠపురములో' చిత్రంలోని 'రాములో రాములా....' సాంగ్ 776 మిలియన్ వ్యూస్ తో రెండో స్థానంలో నిలచింది. 774 మిలియన్ వ్యూస్ తో 'గుంటూరు కారం'లోని 'కుర్చీ మడతపెట్టి.." సాంగ్ చోటు దక్కించుకుంది. ఈ రెండు చిత్రాల దర్శకుడు త్రివిక్రమ్ కావడం, రెండు సినిమాలకూ తమన్ స్వరకల్పన చేయడం గమనార్హం!


నూరు మిలియన్ వ్యూస్ కు పైగా సాధించిన తెలుగు పాటలు ఎన్నో ఉన్నాయి. అయితే రిలీజ్ కు ముందే వంద మిలియన్ వ్యూస్ మార్క్ ను దాటిన చిత్రాలు కొన్నే కనిపిస్తున్నాయి. అవి కూడా ఈ యేడాది వెలుగు చూసిన 'మన శంకర వరప్రసాద్ గారు', త్వరలో రాబోయే 'పెద్ది', 'ద ప్యారడైజ్' సినిమాలే కావడం గుర్తుంచు కోవలసిన అంశం. ఇప్పటికే 'పెద్ది' సినిమా నుండి రెండు పాటలు రిలీజై అలరిస్తున్నాయి. అందులో 'చికిరి...' అంటూ సాగే పాట 198 మిలియన్ వ్యూస్ సంపాదించేసింది. మరో రెండు మిలియన్ వ్యూస్ పోగేస్తే రిలీజ్ కు ముందే 200 మిలియన్ వ్యూస్ సాధించిన సాంగ్‌గా 'చికిరి...' రికార్డ్ నెలకొల్పనుంది. 'పెద్ది' చిత్రానికి ఎ. ఆర్. రహమాన్ బాణీలు కట్టారు. ఇక ఈ చిత్రంలోని 'రై రై రా రా...' సాంగ్ కూడా మురిపిస్తూ సాగుతోంది. ఇది కూడా రిలీజ్ కు ముందే వంద మిలియన్ వ్యూస్ సంపాదిస్తుందని అంటున్నారు. ఇంతలా అలరిస్తున్న పాటలతో రాబోయే సినిమాలు ఏ రేంజ్ లో అలరిస్తాయో చూడాలి.

Updated Date - Apr 08 , 2026 | 04:55 PM