HBD CBN: మీ ప్రతి స్వప్నం సాకారం కావాలని కోరుకుంటూ..
ABN , Publish Date - Apr 20 , 2026 | 10:23 AM
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM CBN) పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా మొత్తం శుభాకాంక్షలతో మార్మోగిపోతుంది.
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM CBN) పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా మొత్తం శుభాకాంక్షలతో మార్మోగిపోతుంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ‘ఎక్స్’ వేదికగా విషెస్ తెలిపారు.'మీ దూరదృష్టి, పట్టుదల, ప్రజల పట్ల ఉన్న అంకిత భావం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. రాష్ట్ర అభివృద్ధి కోసం మీ నిర్విరామ కృషి అందరికీ మార్గదర్శకం. ఆ భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించి, ప్రజల కోసం మీరు కనే ప్రతి స్వప్నం సాకారం కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను' అని చిరంజీవి (Chiranjeevi) తన పోస్ట్ లో పేర్కొన్నారు.
‘చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ముఖ్యమంత్రిగా సుదీర్ఘ పాలన అనుభవం కలిగిన మీరు మీ విజన్‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే గొప్ప బాధ్యతను తీసుకున్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి వంటి లక్ష్యాలతో ముందుకెళ్తున్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా తీర్చిదిద్దుతూ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పెంచుతున్నారు.మంచి ప్రభుత్వం అనే నినాదాన్ని నిజం చేసేలా సాగుతున్న మీ పాలనలో అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్ర స్థానంలో నిలుస్తోందనే నమ్మకం ఉంది. మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను., సంతోషాన్ని అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’ అని పవన్ కళ్యాణ్ (AP DCM Pawan kalyan) ట్వీట్ చేశారు.
'చంద్రబాబు నాయుడు మావయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు నిండైన ఆరోగ్యం, సంతోషం, బలంతో ప్రజాసేవలో అదే దార్శనికత, అంకితభావంతో పని చేయాలని ఆశిస్తున్నాను. రాష్ట్రం అభివృద్ధి, సుసంపన్నత, ఆత్మగౌరవంతో మీ నాయకత్వం కొనసాగాలని కోరుకుంటున్నాను’ అని తారక్ (Jr Ntr) ట్వీట్ చేశారు.